నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో వేదికగా HYA-XVI ఫేజ్-I

గ్రామీణ విద్యార్థులకు డిజిటల్ విద్యను చేరువ చేస్తున్న HYA – Gyan Setu

1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు డిజిటల్ విద్య, ప్రాథమిక కంప్యూటర్ శిక్షణ..

చిన్న వయస్సు నుంచే కంప్యూటర్ పరిజ్ఞానం, డిజిటల్ అభ్యాసం పట్ల అవగాహన పెంపొందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.

ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ.30,000 వ్యయం..

  • జయభేరి, హైదరాబాద్ :

సామాజిక సమస్యలపై యువత ఆలోచనలను  కార్యాచరణగా మలిచే లక్ష్యంతో నిర్వహించిన హైదరాబాద్ యూత్ అసెంబ్లీ (HYA)-XVI సీజన్ ఫేజ్-I అసెంబ్లీ విజయవంతంగా జరిగింది. హైదరాబాద్‌లోని 35కు పైగా కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ అసెంబ్లీలో పాల్గొని, సమాజాన్ని ప్రభావితం చేసే అంశాలపై తమ అభిప్రాయాలను, ఆలోచనలను మరియు పరిష్కార ప్రతిపాదనలను సభలో పొందుపరిచారు. UN Sustainable Development Goals (UNSDGs) ఆధారంగా సాగిన ఈ చర్చలలో విద్యార్థులు వివిధ సామాజిక అంశాలపై విస్తృతంగా చర్చించి, సమస్యల మూలాలను విశ్లేషించడంతో పాటు ఆచరణకు సాధ్యమైన పరిష్కారాలపై తమ ప్రతిపాదనలను వివరించారు. విద్యార్థులు తమ పరస్పర ఆలోచనలను పంచుకోవడం ద్వారా చర్చలు మరింత విస్తృతంగా సాగాయి.

గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు డిజిటల్ పరిజ్ఞానాన్ని అందించాలనే లక్ష్యంతో హైదరాబాద్ యూత్ అసెంబ్లీ (HYA) – XVI ఆధ్వర్యంలో ‘Gyan Setu’ అనే ప్రత్యేక విద్యా ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, ఇంద్రపాలనగర్‌లో ఉన్న IMPPS HW ప్రాథమిక పాఠశాలలో అమలు చేయనున్నారు. ఈ పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు సరైన కంప్యూటర్ సదుపాయాలు లేకపోవడంతో డిజిటల్ విద్య, ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని నిర్వహించిన సర్వేలో గుర్తించారు. హైదరాబాద్ యూత్ అసెంబ్లీ (HYA) అనేది యువతను సామాజిక సమస్యలపై ఆలోచించేలా ప్రోత్సహిస్తూ, వారి ఆలోచనలను ఆచరణాత్మక సామాజిక ప్రాజెక్టులుగా మార్చే ఒక యువజన వేదిక. UN Sustainable Development Goals (SDGs) లక్ష్యాలకు అనుగుణంగా విద్య, ఆరోగ్యం, పేదరిక నిర్మూలన, పారిశుద్ధ్యం వంటి అంశాలపై యువత పనిచేసేలా HYA ప్రోత్సహిస్తుంది.

ఈ నేపథ్యంలో HYA-XVIలోని Quality Education విభాగం ద్వారా Gyan Setu ప్రాజెక్టును చేపడుతున్నారు. ఇందులో భాగంగా పాఠశాలకు రెండు కంప్యూటర్లను అవసరమైన ఉపకరణాలతో సహా అందించి, విద్యార్థులకు డిజిటల్ అభ్యాసానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. కంప్యూటర్ల ఏర్పాటు, ప్రాథమిక విద్యా సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్, ఉపాధ్యాయులకు వినియోగంపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను కూడా చేపట్టనున్నారు.

ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ.30,000 వ్యయం చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా పాఠశాలలో చదువుతున్న 60 మందికి పైగా విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చిన్న వయస్సు నుంచే కంప్యూటర్ పరిజ్ఞానం, డిజిటల్ అభ్యాసం పట్ల అవగాహన పెంపొందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.

కేవలం కంప్యూటర్లను అందించడమే కాకుండా, వాటిని దీర్ఘకాలం పాటు విద్యార్థుల అభ్యాసానికి ఉపయోగపడేలా పాఠశాల యాజమాన్యానికి అప్పగించి, వాటి నిర్వహణకు అవసరమైన సూచనలు కూడా అందించనున్నారు. Gyan Setu ద్వారా గ్రామీణ విద్యార్థులకు డిజిటల్ విద్యకు వారధిని నిర్మిస్తూ, నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో HYA-XVI ఒక అడుగు ముందుకు వేస్తోంది. యువత ఆలోచనలు, భాగస్వామ్యం, కార్యాచరణ ద్వారా సమాజంలో సానుకూల మార్పును తీసుకురావచ్చని ఈ ప్రాజెక్టు చాటిచెప్పనుంది.

jayabherinews@gmail.com
Written by

[email protected]

↑