← Home https://jayabherinews.com/ · E-Paper Back to article
🏠 Home
Date of Publish : 12 November 2026, 10:19 AMPosted by : [email protected]

వీరేందర్ సెహ్వాగ్ తనయుడి విధ్వంసం.. అండర్-19 ఆసియా కప్ సెమీస్‌లోకి భారత్!

ఒమన్‌ వేదికగా జరిగిన అండర్-19 ఆసియా కప్ కీలక గ్రూప్ పోరులో భారత యువ జట్టు సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ ఆకాశమే హద్దుగా చెలరేగి 168 బంతుల్లో 17 ఫోర్లు, 7 సిక్సర్లతో 160 పరుగుల భారీ శతకం బాది జట్టును ముందుండి నడిపించాడు. దీంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 309 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 310 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ జట్టును భారత బౌలర్లు క్రమం తప్పకుండా దెబ్బతీసి 49.6 ఓవర్లలో 239 పరుగులకే ఆలౌట్ చేశారు. ఈ 70 పరుగుల ఘనవిజయంతో భారత్ దర్జాగా సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లింది.

రెండో వికెట్‌కు 193 పరుగుల రికార్డు భాగస్వామ్యం

టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ లక్ష్య రాజేష్ రాయ్‌చందాని (17) త్వరగానే ఔటయ్యాడు. ఆ దశలో క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ వి.కె. వినీత్‌తో కలిసి ఆర్యవీర్ సెహ్వాగ్ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

ఈ ద్వయం రెండో వికెట్‌కు ఏకంగా 193 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని జోడించి భారీ స్కోరుకు గట్టి పునాది వేసింది. వినీత్ 69 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 67 పరుగులు చేసి విలువైన సహకారం అందించాడు. చివరి ఓవర్లలో యశ్‌వర్ధన్ చౌహాన్ (17), అన్వయ్ ద్రవిడ్ (12) వేగంగా ఆడటంతో భారత్ టోర్నీలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. యూఏఈ బౌలర్లలో నసీమ్ ఖాన్ 4 వికెట్లు పడగొట్టాడు.

లక్ష్య ఛేదనలో యూఏఈ బ్యాటర్లు గట్టిగానే పోరాడినప్పటికీ భారత బౌలింగ్ ధాటికి నిలవలేకపోయారు. అహ్మద్ ఖుదాదాద్ 74 పరుగులతో ఒంటరి పోరాటం చేయగా, నూరుల్లా అయోబీ 39 పరుగులు జోడించాడు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో యూఏఈకి ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో ఇషాన్ సూద్ 37 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు తీసి ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. మనల్ చౌహాన్, కావ్య పటేల్, అర్జున్ రాజ్‌పుత్ తలో వికెట్ దక్కించుకున్నారు. లీగ్ దశలో పాక్‌పై ఓటమి తర్వాత అద్భుతంగా పుంజుకున్న భారత్, సెమీఫైనల్ పోరులో అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది.

jayabheridaily.com
👁 1 clip views📰 Share Epaper Clip