← Home https://jayabherinews.com/ · E-Paper Back to article
🏠 Home
Date of Publish : 12 November 2026, 10:31 AMPosted by : [email protected]

సామాన్యులకు, రైతులకు, వ్యాపారులకు మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. రూ.77,101 కోట్లతో 5 కీలక నిర్ణయాలు!

ప్రజలు, రైతులు, చిన్న వ్యాపారులకు ప్రయోజనం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర కేబినెట్ సమావేశంలో మొత్తం ఐదు ముఖ్యమైన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. వీటి అమలుకు కలిపి రూ.77,101 కోట్లు ఖర్చు చేయనుంది. ఇందులో కొత్త మెట్రో రైలు మార్గం, చిన్న వ్యాపారులకు రుణ భరోసా, దేశ చరిత్రను చాటిచెప్పే భారీ మ్యూజియం నిర్మాణం, రైతులకు ఎరువుల రాయితీ, స్వయం ఉపాధి పథకానికి నిధులు వంటి అంశాలు ఉన్నాయి. ఈ నిర్ణయాల వల్ల వివిధ వర్గాలకు ప్రయోజనం కలగనుంది.

గ్రేటర్ నోయిడాకు కొత్త మెట్రో మార్గం
ప్రయాణికుల సౌకర్యాన్ని పెంచేందుకు గ్రేటర్ నోయిడా వరకు కొత్త మెట్రో ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పనుల కోసం రూ.2,390 కోట్ల బడ్జెట్ కేటాయించింది. ఈ మార్గం అందుబాటులోకి వస్తే ప్రతిరోజూ ప్రయాణించే లక్షలాది మంది, ఉద్యోగులు, విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గడంతో పాటు రెండు నగరాల మధ్య రాకపోకలు మరింత సులభమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

ముద్రా రుణాలకు రూ.5,000 కోట్ల భరోసా
చిన్న వ్యాపారులకు రుణాలు అందించడం కోసం ప్రధానమంత్రి ముద్రా యోజన కింద రూ.5,000 కోట్ల క్రెడిట్ గ్యారంటీ నిధికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 2015 ఏప్రిల్‌లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, ఇతర అర్హత కలిగిన సంస్థల నుంచి సూక్ష్మ వ్యాపారాలకు రుణాలు అందుతున్నాయి. ఈ హామీ వ్యవస్థతో తాకట్టు లేకుండా రుణాలు ఇచ్చేందుకు ఆర్థిక సంస్థలకు భరోసా లభిస్తుంది. ముద్రా పథకం కింద మొత్తం రూ.12.6 లక్షల కోట్ల రుణాలకు గ్యారంటీ కల్పించే అవకాశం ఉంటుంది.

యుగే యుగీన్ భారత్ మ్యూజియానికి రూ.3,230 కోట్లు
దేశ చరిత్ర, కళలు, సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో ఢిల్లీలోని నార్త్, సౌత్ బ్లాక్ భవనాలను భారీ మ్యూజియంగా మార్చేందుకు రూ.3,230 కోట్లు కేటాయించారు. సుమారు 1.79 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇది నిర్మితమవుతుంది. రోజుకు దాదాపు 30 వేల మంది సందర్శకులకు అవకాశం కల్పించేలా రూపకల్పన చేస్తున్నారు. పారిస్‌లోని లూవ్రే మ్యూజియం కంటే పెద్దదిగా దీన్ని తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 2027 చివర్లో తొలి గ్యాలరీని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. 2031 ఆర్థిక సంవత్సరం వరకు దశలవారీగా పనులు చేపట్టనున్నారు. ప్రదర్శన కోసం వివిధ మ్యూజియాలు, సేకరణల్లోని సుమారు 18 లక్షల వస్తువులను గుర్తించారు.

రైతులకు ఎరువుల రాయితీ.. స్టాండప్ ఇండియాకు నిధులు
రైతులకు ఊరటనిస్తూ రబీ 2026-27 సీజన్‌కు పోషక ఆధారిత రాయితీ (NBS) కొత్త ధరలకు కేంద్రం ఆమోదం తెలిపింది. అవసరమైన ఎరువులు సరసమైన ధరలకు అందించడమే దీని ఉద్దేశం. అలాగే స్టాండప్ ఇండియా పథకం క్రెడిట్ గ్యారంటీ నిధికి రూ.4,111 కోట్లు కేటాయించింది. వ్యాపారాలు ప్రారంభించాలనుకునే, విస్తరించాలనుకునే ఔత్సాహికులకు సంస్థాగత రుణాలు సులభంగా అందించేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడనుంది.

jayabheridaily.com
👁 3 clip views📰 Share Epaper Clip