సచివాలయాల్లో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆకస్మిక తనిఖీలు

జయభేరి, చిట్వేలి, సెప్టెంబర్ 11:
 ఓబులవారిపల్లి మండలంలోని చిన్న ఓరంపాడు, ముక్కావారి పల్లి సచివాలయాలను రైల్వే కోడూరు నియోజకవర్గం శాసనసభ్యులు అరవ శ్రీధర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయాల్లో ఉద్యోగుల హాజరు, సమయపాలనతో పాటు ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలపై ఆయన స్వయంగా ఆరా తీశారు. విధుల పట్ల నిర్లక్ష్యం లేకుండా సమయపాలన పాటిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను బాధ్యతాయుతంగా పరిష్కరించాలని అధికారులు, సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే ప్రజలకు స్వయంగా సహకరిస్తూ, దరఖాస్తు ప్రక్రియపై అవగాహన కల్పించారు.
సచివాలయాల సందర్శన సందర్భంగా స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను ఆయన పరిశీలించారు. ఆయా సమస్యలపై సంబంధిత రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులతో అక్కడికక్కడే చరవాణిలో మాట్లాడి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమం ప్రజల హక్కు, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సేవలు సకాలంలో అందాలి అని శాసనసభ్యులు అరవ శ్రీధర్ పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సేవల అమలు తీరును నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.

jayabherinews@gmail.com
Written by

jayabherinews@gmail.com