స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై రేవంత్ ఆవేదన..

ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ

జయభేరి, హైదరాబాద్ :
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిశారు. మంగళవారం అసెంబ్లీ స్పీకర్‌ ఛాంబర్‌లో ప్రసాద్‌ను పరామర్శించారు. సోమవారం అసెంబ్లీ ఎదుట జరిగిన పరిణామాలపై స్పీకర్‌ను ముఖ్యమంత్రి ఓదార్చారు. ప్రసాద్‌‌పై వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఆవరణలో అధికారులపై దాడుల ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. మహిళా అధికారుల పట్ల బీఆర్ఎస్ నేతల అనుచిత ప్రవర్తనపై విమర్శలు గుప్పించింది. స్పీకర్‌ను అసభ్య పదజాలంతో దూషించడం ప్రజాస్వామ్యానికి అవమానమని ప్రభుత్వం భావిస్తోంది.
ఘటనలపై మీడియాలో ప్రముఖంగా వచ్చిన కథనాల నేపథ్యంలో స్పీకర్‌ను సీఎం పరామర్శించారు. మంగళవారం అసెంబ్లీకి వచ్చిన వెంటనే స్పీకర్ ఛాంబర్‌లో ప్రసాద్ కుమార్‌ను ఓదార్చారు. తనను వ్యక్తిగతంగా దూషించటంతో స్పీకర్ కంట తడి పెట్టుకున్న దృశ్యాలపై ముఖ్యమంత్రి తీవ్ర ఆవేదన చెందారు. బాధ్యులపై తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటామని స్పీకర్‌కు హామీ ఇచ్చారు. ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అసెంబ్లీ గౌరవం, రాజ్యాంగ పదవుల ప్రతిష్ఠ కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

jayabherinews@gmail.com
Written by

jayabherinews@gmail.com