ధాన్యం కొనుగోలుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయండి

జయభేరి, జయశంకర్ భూపాలపల్లి :
ధాన్యం కినుగోలు ప్రక్రియను ఎలాంటి ఇబ్బందులు, లోటుపాట్లు లేకుండా సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం వానాకాలం ధాన్యం కొనుగోలుకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై రెవెన్యూ, పౌర సరఫరాలు, సహకార, మార్కెటింగ్, సహకార, వ్యవసాయ, డిఆర్డీఏ, ఎస్ డబ్ల్యూసి అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు కేంద్రాలు, గోదాములు, రైస్ మిల్లులు, రవాణా, గన్నీ బ్యాగులు తదితర అంశాలపై శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యలను కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం సేకరణ ప్రక్రియ ప్రారంభానికి ముందే అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి,  సమస్యలకు తావులేకుండా కార్యాచరణ రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు.

అవసరమైన స్టోరేజ్ స్థలాన్ని ముందుగానే సిద్ధం చేయాలి
ధాన్యం సేకరణ అనంతరం నిల్వ చేసేందుకు అవసరమైన స్టోరేజ్ స్పేస్‌ను ముందుగానే గుర్తించి సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని గోదాములు, రైస్ మిల్లుల సామర్థ్యాన్ని పరిశీలించి గతంలో ఎదురైన సమస్యలను గుర్తించి వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. సేకరించిన ధాన్యం నిల్వలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని సూచించారు. రవాణా వాహనాలు అందుబాటులో ఉండాలని,  ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులు, గోదాములకు ధాన్యాన్ని సకాలంలో తరలించేందుకు అవసరమైన సంఖ్యలో లారీలు, రవాణా వాహనాలను ముందుగానే సమకూర్చుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. రవాణా ప్రక్రియలో జాప్యం కారణంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని రవాణా వాహనాలను నిబంధనల ప్రకారం టెండర్ ప్రక్రియలోకి తీసుకురావడంతో పాటు, వాహనాల ఫిట్‌నెస్‌ను ముందుగానే పరిశీలించి, జిపిఎస్ ఏర్పాటుతో సిద్ధంగా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ధాన్యం ప్యాకింగ్‌కు అవసరమైన గన్నీ బ్యాగుల లభ్యతపై ముందస్తు అంచనాలు రూపొందించి, మిల్లులు, సంబంధిత ఏజెన్సీలతో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. అవసరమైన గన్నీ బ్యాగుల సంఖ్యకు సంబంధించి రీకన్సిలేషన్ ప్రక్రియను పూర్తి చేసి, సేకరణ ప్రారంభమయ్యే నాటికి తగినంత నిల్వ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఈ నెలాఖరులోగా అన్ని కొనుగోలు కేంద్రాలను మ్యాపింగ్ చేయాలి
జిల్లాలో ఏర్పాటు చేయనున్న అన్ని ప్రాథమిక ధాన్యం కొనుగోలు కేంద్రాలను  యాప్ ద్వారా ఈ నెలాఖరులోగా మ్యాపింగ్ చేసి, అవసరమైన సాంకేతిక ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి కొనుగోలు కేంద్రం రైతులకు సౌకర్యవంతంగా ఉండేలా అవసరమైన మౌలిక వసతులను ముందుగానే పరిశీలించాలని సూచించారు.
వ్యవసాయ శాఖ అధికారులు  ధాన్యం దిగుబడి, ప్రభుత్వ సేకరణకు వచ్చే ధాన్యం పరిమాణంపై సమగ్రంగా పరిశీలన చేసి స్పష్టమైన నివేదిక రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. వ్యవసాయ శాఖ అంచనా వేసిన మొత్తం ధాన్యం ఉత్పత్తి, ప్రభుత్వ సేకరణకు లక్ష్యంగా నిర్ణయించిన పరిమాణం మధ్య స్పష్టత ఉండేలా రీకన్సిలేషన్ నివేదికను సిద్ధం చేయాలని సూచించారు. ఈ వివరాల ఆధారంగా కొనుగోలు కేంద్రాలు, గన్నీ బ్యాగులు, రవాణా వాహనాలు, నిల్వ సామర్థ్యం తదితర అంశాలపై ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యంత్రాంగం ప్రధాన బాధ్యత అని కలెక్టర్ స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన సమాచారం అందుబాటులో ఉంచడంతో పాటు, ధాన్యం సేకరణలో పారదర్శకత పాటించాలని ఆదేశించారు.
రైతులు పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసి, కొనుగోలు కేంద్రాల వద్ద అనవసర నిరీక్షణకు తావులేకుండా వేగవంతమైన కొనుగోలు, రవాణా, నిల్వ ప్రక్రియను అమలు చేయాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, ధాన్యం సేకరణకు సంబంధించిన ప్రతి అంశాన్ని ముందుగానే పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ సౌరవ్ శర్మ, రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, పౌర సరఫరాల డిఎం రాములు, సహకార అధికారి వాల్య నాయక్, మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి,  డబ్ల్యూసి ఆర్ ఎం దీపిక, అదనపు డిఆర్డీఏ చౌహాన్, ఏఎంవిఐ  సుందర్ లాల్ తదితరులు పాల్గొన్నారు.

jayabherinews@gmail.com
Written by

jayabherinews@gmail.com