ఏడేళ్ల బాలికపై 75 ఏళ్ల వ్రుద్ధుడి లైంగిక దాడి

జయభేరి, శ్రీకాకుళం, సెప్టెంబర్ 11 :
శ్రీకాకుళం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలతో 75 ఏళ్ల వృద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోటబొమ్మాళి మండలం గుంజిలోవ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. గుంజిలోవ గ్రామానికి చెందిన కవిటి రామారావు (75) బుధవారం మధ్యాహ్నం ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదు అందింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు కోటబొమ్మాళి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా కోటబొమ్మాళి పోలీసులు BNSలోని సంబంధిత సెక్షన్లతో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్‌ 5(m) రెడ్ విత్ 6 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు.. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. టెక్కలి డీఎస్పీ దాసరి లక్ష్మణరావు బాలిక నివాసానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించి విచారణ చేపట్టారు. క్లూస్‌ టీమ్‌ కూడా ఘటనాస్థలంలో ఆధారాలను సేకరించినట్లు పోలీసులు తెలిపారు.కేసు దర్యాప్తులో భాగంగా గురువారం సాయంత్రం కోటబొమ్మాళి మార్కెట్‌ యార్డు వద్ద నిందితుడు కవిటి రామారావును టెక్కలి డీఎస్పీ దాసరి లక్ష్మణరావు ఆధ్వర్యంలోని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని కోటబొమ్మాళి పోలీస్‌ స్టేషన్‌ నుంచి ప్రత్యేక జ్యుడీషియల్‌ సెకండ్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా పోలీసులు నిందితుడిని నడిపిస్తూ కోర్టుకు తీసుకెళ్లారు.కేసును విచారించిన న్యాయస్థానం నిందితుడికి ఏడు రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని పోలీసులు శ్రీకాకుళం జిల్లా జైలుకు తరలించారు. గార మండలం అంపోలు ప్రాంతంలోని జైలుకు వాహనంలో తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.చిన్నారులపై లైంగిక నేరాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. కేసులో అందుబాటులోకి వచ్చిన ఆధారాల ఆధారంగా తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు

jayabherinews@gmail.com
Written by

jayabherinews@gmail.com