రెట్రో లుక్ లో లీడర్స్…

జయభేరి, హైదరాబాద్, సెప్టెంబర్ 11
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్, తాజాగా ట్రెండింగ్‌లో ఉన్న ఓ ఛాలెంజ్‌లో పాలుపంచుకుని నెటిజన్లను ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న #80sTrend లో ఆయన కూడా జాయిన్ అయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో రూపొందించిన తన 80వ దశకం నాటి రెట్రో లుక్ ఫొటోను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. “జంప్డ్ ఆన్ ది #80s ట్రెండ్” అనే చిన్న క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది.ఈ ఫొటోలో నారా లోకేశ్ పూర్తి రెట్రో అవతార్‌లో కనిపించారు. ఉంగరాల జుట్టు, రంగురంగుల జామెట్రీ డిజైన్‌తో కూడిన చొక్కా, లేత రంగు జీన్స్ ప్యాంట్‌తో 80ల నాటి ఫ్యాషన్‌ను గుర్తుచేశారు. చొక్కాకు సన్‌గ్లాసెస్ తగిలించుకుని, చేతికి వాచ్‌తో వింటేజ్ లుక్‌ను పూర్తి చేశారు. పక్కనే ఉన్న పాతకాలపు నలుపు రంగు కారు, వెనుకవైపు సూర్యాస్తమయం, తాటిచెట్లతో ఉన్న “1985” అనే బిల్‌బోర్డ్ ఆ ఫొటోకు మరింత రెట్రో అనుభూతిని తెచ్చిపెట్టాయి.ప్రస్తుతం సోషల్ మీడియాలో #80sTrend బాగా ప్రాచుర్యంలో ఉంది. సామాన్య నెటిజన్ల నుంచి సినీ తారల వరకు చాలా మంది ఏఐ టూల్స్ ఉపయోగించి తమ 80ల నాటి ఫొటోలను సృష్టించుకుని షేర్ చేసుకుంటున్నారు. ఇదే బాటలో ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా చేరారు. నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే లోకేశ్, ఇలాంటి ట్రెండీ పోస్ట్‌తో తనలోని మరో కోణాన్ని అభిమానులకు చూపించారు.లోకేశ్ పోస్ట్ చేసిన కొద్ది సేపటికే వేలాది లైకులు, వ్యూస్‌తో ఈ ఫొటోకు భారీ స్పందన లభించింది. ఆయన మద్దతుదారులు, అభిమానులు “సూపర్ లుక్”, “ట్రెండ్ ఫాలో అవుతున్న యువ నాయకుడు” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
షేక్  చేస్తున్న రేవంత్ ఫోటో
 రాజకీయం.. పదునైన విమర్శలు.. అధికారిక సమీక్షలతో బిజీగా ఉండే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారిగా కాలంలో వెనక్కి వెళ్లారు. అదేదో టైమ్ మెషిన్ ఎక్కి కాదు లెండి.. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచాన్ని ఏలుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) దయవల్ల.. రోజువారీ పొలిటికల్ డ్రామా నుంచి కాస్త బ్రేక్ తీసుకున్నట్లున్నారు.. 1980ల కాలం నాటి రెట్రో లుక్‌లోకి మారిపోయి నెటిజన్లకు పెద్ద షాకే ఇచ్చారు. సరిగ్గా 80ల నాటి ఫిల్టర్ తగిలించి.. అప్పటి కాలపు బ్రౌన్ షేడ్స్, జుట్టు విరబోసుకున్న హెయిర్ స్టైల్, రెట్రో షర్ట్‌తో మెరిసిపోతున్న తన ఏఐ రూపాన్ని స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. సాధారణంగా రాజకీయ నాయకుల సోషల్ మీడియా ఖాతాలు తెరవగానే ప్రెస్ మీట్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విపక్షాలపై విమర్శల హోరే కనిపిస్తుంది. కానీ అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి పీఠంపై ఉన్న నాయకుడే స్వయంగా ఈ “వింటేజ్ ఏఐ ట్రెండ్”లో దూకడంతో నెటిజన్ల కళ్ళు బైర్లు కమ్మాయి. “అన్న హెయిర్ స్టైల్ చూశారా.. అప్పట్లో ఈ లుక్‌తో తిరిగితే కచ్చితంగా ఏదో ఒక సినిమాలో హీరో ఆఫర్ వచ్చి ఉండేది” అంటూ ఫ్యాన్స్ లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక రాజకీయాల్లో పొత్తులు, సభలు ఎంత ముఖ్యమో.. యువత ఓట్లను ఆకట్టుకోవడానికి ఇన్స్టాగ్రామ్ ట్రెండ్స్, మీమ్స్ కూడా అంతే ముఖ్యమని రేవంత్ రెడ్డి బాగా గ్రహించినట్లున్నారు. పాలనలో “స్పీడ్” చూపిస్తున్న సీఎం గారు.. డిజిటల్ ట్రెండ్స్‌లో కూడా “మాస్” అనిపించుకోవడానికి గట్టిగానే ట్రై చేస్తున్నారు. రేవంత్ రెడ్డి వేసిన ఈ ఏఐ బాట చూసి.. ఇప్పుడు విపక్ష నాయకులలో కూడా టెన్షన్ మొదలై ఉంటుంది. రేవంత్ 80ల లుక్ తెచ్చారు కదా.. మరి మేమేం తక్కువ తిన్నామా అని రేపో మాపో మిగతా నేతలు కూడా 70ల నాటి బెల్ బాటమ్ ప్యాంట్లు, ఎన్టీఆర్-కృష్ణ ల్యాండ్ మార్క్ లుక్స్‌తో ల్యాండ్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మొత్తానికి నిత్యం వేడివేడిగా ఉండే తెలంగాణ రాజకీయాల్లోకి రేవంత్ రెడ్డి తన వింటేజ్ అవతారంతో కాస్త వినోదాన్ని.. ట్రెండీ కలర్‌ను నింపారని చెప్పవచ్చు.

jayabherinews@gmail.com
Written by

jayabherinews@gmail.com