జయభేరి, మెదక్, హైదరాబాద్, సెప్టెంబర్ 17 :
తెలంగాణ రాజకీయాల్లో గత దశాబ్ద కాలంగా అత్యంత ఆసక్తికరమైన, అంతకుమించి రహస్యమైన కేంద్రం ఏదైనా ఉందంటే అది సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్. ప్రారంభంలో కొద్దిపాటి ఎకరాల విస్తీర్ణంలో, కేవలం రెండు అంతస్తుల సాధారణ గెస్ట్‌హౌస్‌తో మొదలైన ఈ వ్యవసాయ క్షేత్రం.. కాలక్రమేణా వేల మీటర్ల పొడవాటి ప్రహరీ గోడలు, పటిష్టమైన నిఘా వ్యవస్థ, అత్యాధునిక రాజభవన సముదాయాలతో ఒక అభేద్యమైన కోటలా రూపాంతరం చెందింది. పార్టీలో సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలకు సైతం కేవలం ప్రవేశ ద్వారం వద్ద నిర్మించిన షెడ్డు వరకే అనుమతి ఉంటుంది. లోపల కనుచూపు మేరలో విస్తరించి ఉన్న ఆకుపచ్చని తోటలు, నిర్మాణాల లోగుట్టు సొంత పార్టీ శ్రేణులకు కూడా చిక్కేది కాదన్నది బహిరంగ సత్యం. పాలనా పగ్గాలు చేతిలో ఉన్నప్పుడు ఫామ్‌హౌస్ కేంద్రంగా సాగిన పాలన పై నిరంతరం ఎదురుదాడి చేసిన విపక్షాలకు, అది ఎప్పుడూ ఒక ఛేదించలేని రహస్య కేంద్రంగానే మిగిలిపోయింది.ఈ సుదీర్ఘ మిస్టరీకి తెరదించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా విచారణాస్త్రం సంధించడంతో ఎర్రవల్లి కోట చుట్టూ ఉన్న పొగమంచు వీడబోతోంది. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం అసలు పరిమాణం ఎంత? అందులో కేసీఆర్ స్వయంగా కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూమి ఎంత? కౌలు పేరిట చేజిక్కించుకున్నది ఎంత? బినామీల పేరిట చుట్టుపక్కల విస్తరించిన భూభాగం ఎంత? అన్న లెక్కలు తేల్చేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఫామ్‌హౌస్ పరిధి సుమారు 700 ఎకరాలకు పైగా విస్తరించి ఉందని, అందులోనే ఏకంగా 340 నుంచి 388 ఎకరాల మేర అసైన్డ్, ప్రభుత్వ భూమి కలిసిపోయి ఉందన్న రేవంత్ ఆరోపణలతో అధికార యంత్రాంగం సమగ్ర భూ సర్వేకు నడుం బిగించింది. జిల్లా కలెక్టర్, రెవెన్యూ విభాగాలకు 30 రోజుల స్పష్టమైన డెడ్‌లైన్ విధించడం ఈ విచారణ తీవ్రతను స్పష్టం చేస్తోంది.ఇది కేవలం ఒక రాజకీయ నాయకుడి ఆస్తిపాస్తుల పరిశీలన మాత్రమే కాదు. ల్యాండ్ సీలింగ్ చట్టం, ధరణి పోర్టల్ సమగ్రతపై జరుగుతున్న అతిపెద్ద న్యాయ-పరిపాలనా పరీక్ష. తెలంగాణ అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం ఒక కుటుంబ యూనిట్‌కు గరిష్ట పరిమితి ఉండగా, కేసీఆర్ కుటుంబం అధికారికంగానే దాదాపు 439 ఎకరాలను ఎలా కలిగి ఉందన్న సాంకేతిక చిక్కును కాంగ్రెస్ ప్రభుత్వం లేవనెత్తుతోంది. అంతేకాకుండా, గత ప్రభుత్వ హయాంలో ధరణి ద్వారా రికార్డులను నిషేధిత జాబితా నుంచి తొలగించారా? స్థానిక రైతుల వద్ద నుంచి తీసుకున్న భూములకు చట్టబద్ధమైన బదలాయింపులు జరిగాయా? లేక అధికార బలాన్ని అడ్డం పెట్టుకుని హద్దులు విస్తరించారా? అనే అంశాలపై డ్రోన్ సర్వేలు, పాత పహాణీల రికార్డులు పరిశీలిస్తే విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూసే అవకాశముంది.ఒకవేళ విచారణలో ప్రభుత్వ, అసైన్డ్ భూముల ఆక్రమణ నిజమని తేలితే, వాటిని వెంటనే స్వాధీనం చేసుకుని దళిత, పేద వర్గాలకు పంచుతామన్న ప్రభుత్వ ప్రకటన బీఆర్ఎస్ అధినేతను ఆత్మరక్షణలోకి నెడుతుంది. ఇన్నాళ్లూ ప్రగతిశీల వ్యవసాయం , ఆధునిక సేద్యం పేరుతో ప్రచారం చేసుకున్న మోడల్ ఫామ్‌హౌస్ వెనుక అసలు కథ ఏమిటన్నది ఇప్పుడు అధికారిక డాక్యుమెంట్ల సాక్షిగా బట్టబయలు కానుంది. రేవంత్ ప్రభుత్వం వేసిన ఈ దూకుడు అడుగుతో, దశాబ్ద కాలంగా ఎవరికీ అంతుచిక్కని కేసీఆర్ ఫామ్‌హౌస్ రహస్యాలు ప్రజాక్షేత్రంలో బట్టబయలయ్యే ఘట్టం సమీపించినట్లే కనిపిస్తోంది.
ఫామ్ హౌస్‌లో సగానికిపైగా స్వాధీనం ఖాయం?





