- ఫ్రంట్లైన్ సిబ్బందికి ఆయుధాల కోసం రూ.4.095 కోట్ల ప్రతిపాదనలు
- ఎక్సైజ్ శాఖకు ఆయుధాలు ఇచ్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది
- +1,516 ఉద్యోగాల భర్తీ- కొనసాగుతున్న ప్రక్రియ
- అటవీ అమరవీరుల త్యాగాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తి: మంత్రి జూపల్లి కృష్ణారావు
- అటవీ అమరవీరులకు ఘన నివాళులు అర్పించిన మంత్రి జూపల్లి కృష్ణారావు, వైరా ఎమ్మెల్యే బానోత్ రాందాస్ నాయక్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, పీసీసీఎఫ్ (HoFF) వినయకుమార్
జయభేరి, హైదరాబాద్, సెప్టెంబర్ 11:
అడవులు, వన్యప్రాణుల సంరక్షణలో ప్రాణాలను పణంగా పెడుతున్న అటవీ సిబ్బంది భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అటవీ అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని అటవీ సంరక్షణను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నెహ్రూ జూలాజికల్ పార్క్ స్మారక చిహ్నం వద్ద మంత్రి జూపల్లి కృష్ణారావు , అధికారులు, సిబ్బంది పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, పీసీసీఎఫ్ (HoFF) వినయకుమార్, పీసీసీఎఫ్ (డెవలప్మెంట్) రత్నాకర్ జోహరి, టీజీఎఫ్డీసీ- వీసీ అండ్ ఎండీ సునీతా భగవత్, ఇతర అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, రిటైర్డ్ అధికారులు పాల్గొన్నారు. వన్య ప్రాణుల వేట కోసం అమర్చిన విద్యుత్ వైర్లు తగిలి మరణించిన చెరువుసింగారం వెస్ట్ బీట్ ఆఫీసర్ బానోత్ నవీన్ కుటుంబానికి రూ. 30 లక్షల చెక్కును అందించారు. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.
అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. అటవీ రక్షణకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలిపారు. అటవీ నేరాలు, కలప అక్రమ రవాణా, అటవీ ఆక్రమణలు, వన్యప్రాణుల వేటను అరికట్టేందుకు క్షేత్రస్థాయిలో నిరంతర చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. అటవీశాఖను బలోపేతం చేయడానికి 1,393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు (ఎఫ్‌బీవోలు), 15 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు (ఎఫ్‌ఆర్‌వోలు), 18 అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (ఏసీఎఫ్‌లు), ఇతర కేటగిరీల్లో కలిపి మొత్తం 1,516 ఉద్యోగాల నియామకాలకు ప్రభుత్వం అనుమతిచ్చిందని తెలిపారు. భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
2014 నుంచి జూలై 2026 వరకు 1,06,685 ఓఆర్ (Offence Report) కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వీటిలో రూ.55.99 కోట్ల విలువైన కలపకు సంబంధించిన కేసులు ఉన్నాయని, రూ.160.75 కోట్ల కంపౌండింగ్ ఫీజు వసూలు చేసినట్లు వెల్లడించారు. ఈ కేసులకు సంబంధించి 19,482 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అదనంగా 31,523 యూడీఓఆర్ (Undetected Forest Offence Report) కేసులు నమోదు చేసి, రూ.70.72 కోట్ల విలువైన కలపను స్వాధీనం చేసుకుని కలప డిపోలకు తరలించినట్లు తెలిపారు. 11,824 అటవీ ఆక్రమణ కేసులు కూడా నమోదయ్యాయని వెల్లడించారు.



