ఫైళ్లు వెంట వెంటనే క్లియర్ చేయండి

జయభేరి, విజయవాడ, సెప్టెంబర్ 11 :
అమరావతి సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనా వేగంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.  ప్రభుత్వ ఫైళ్ల క్లియరెన్స్‌లో జరుగుతున్న ఆలస్యాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. సరైన సమయంలో ఫైళ్లను క్లియర్ చేయకపోవడం వల్ల ప్రజలకు అందాల్సిన సేవలు ఆలస్యమవుతున్నాయని అధికారులకు గట్టిగా క్లాస్ తీసుకున్నారు. పాలనలో పారదర్శకత, వేగం ఉండాలని పదేపదే చెబుతున్నప్పటికీ అధికారుల ప్రవర్తనలో మార్పు రాకపోవడంపై సీఎం అసహనం వ్యక్తం చేశారు.అంతేకాకుండా, ఎంతో ప్రాధాన్యత కలిగిన కలెక్టర్ల కాన్ఫరెన్సుకు కూడా కొందరు ఉన్నతాధికారులు హాజరు కాకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సమీక్షల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల ధైర్యం ఏంటో అర్థం కావడం లేదని నిలదీశారు. కాన్ఫరెన్సుకు గైర్హాజరైన అధికారులందరి నుంచి వెంటనే రాతపూర్వక వివరణ సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి   సాయిప్రసాద్‌ను సీఎం చంద్రబాబు ఆదేశించారు. అధికారుల పనితీరును అంచనా వేసే ఐఏఎస్ అధికారుల 360 డిగ్రీల నివేదికను  అందరి అభిప్రాయాలను ప్రాతిపదికగా తీసుకుని పక్కాగా తయారు చేస్తామని హెచ్చరించారు.ఫైళ్ల నిర్వహణపై స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ, రెండు రోజులు లేదా అంతకంటే తక్కువ సమయంలో ఫైళ్లను క్లియర్ చేసిన అధికారులకు సీఎం అభినందనలు తెలిపారు. అదే సమయంలో  జీరో డే లోనే ప్రాసెస్ పూర్తి చేసిన వారికి ప్రత్యేక అభినందనలు అందజేశారు. అయితే, కొన్ని శాఖల్లో ఫైళ్లు క్లియర్ చేయడానికి మంత్రులు కూడా 4 రోజుల వరకు సమయం తీసుకుంటున్నారని, వారు మరింత వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. కార్యదర్శులు కేవలం ఏసీ గదులకే పరిమితం కాకుండా తప్పనిసరిగా క్షేత్రస్థాయి పర్యటనలు చేసి ప్రజల నుంచి నేరుగా ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని స్పష్టం చేశారు.పరిపాలనను పూర్తిగా డిజిటలైజ్ చేసే దిశగా సీఎం చంద్రబాబు కీలక గడువు విధించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు రాబోయే నెల రోజుల్లోగా 100 శాతం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే ఫైళ్ల నిర్వహణ చేపట్టాలని స్పష్టం చేశారు. ఇకపై ఎక్కడైనా మాన్యువల్ ఫైళ్లు రన్ చేస్తే దానిని తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మాన్యువల్ ఫైళ్ల నిర్వహణ విధానాన్ని పూర్తిగా తుడిచిపెట్టేలా నెల రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని, మంత్రులు కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వేగవంతమైన, జవాబుదారీతనంతో కూడిన పాలన అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందని, అందులో అధికారుల నిర్లక్ష్యాన్ని సహించేది లేదని సీఎం స్పష్టం చేశారు. ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ ఆధారంగా అధికారుల పెర్ఫార్మెన్స్‌ను నిరంతరం పర్యవేక్షిస్తామని తెలిపారు. ఇప్పటికైనా మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లు సమన్వయంతో పనిచేసి ఫైళ్ల క్లియరెన్స్‌ వేగవంతం చేయాలని, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు వేగంగా ప్రజలకు చేరేలా చూడాలని సదస్సు వేదికగా సీఎం ఆదేశించారు.
ఫ్యామిలీ యూనిట్ కు ప్రాధాన్యం ఇవ్వండి
సంక్షేమ పథకాల ప్రయోజనాల కోసం కుటుంబాలు చిన్న చిన్న యూనిట్లుగా విడిపోవడాన్ని నిరుత్సాహపరచాలని, భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలన్నింటినీ ‘ఫ్యామిలీ యూనిట్’ ప్రాతిపదికనే అమలు చేయాలని సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. పెద్ద కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తూ, ఆ కుటుంబానికి ఎక్కువ ప్రయోజనాలు అందించడమే కూటమి ప్రభుత్వ విధానమని ఆయన స్పష్టం చేశారు. నేడు అమరావతిలో జరిగిన 8వ కలెక్టర్ల సమావేశంలో రెండో రోజున, సూపర్-6 పథకాల అమలుపై ఆయన సమీక్ష నిర్వహించి, పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
కొత్తగా పెన్షన్లు మంజూరు చేసే ప్రక్రియకు ముందే రాష్ట్రవ్యాప్తంగా కుటుంబాల మ్యాపింగ్ పూర్తి చేయాలని సీఎం సూచించారు. అయితే, ప్రస్తుతం ఉన్న లబ్ధిదారులను యథాతథంగా కొనసాగించాలని స్పష్టత ఇచ్చారు. రేషన్ కార్డులు, పెన్షన్ల కోసం కుటుంబాలు విడిపోవడం సమాజానికి మంచిది కాదని, పెద్ద కుటుంబాలను ప్రోత్సహించేలా ప్రభుత్వ విధానాలు ఉండాలని అన్నారు. దీనికి అనుగుణంగానే అధికారులు కార్యాచరణ రూపొందించాలని దిశానిర్దేశం చేశారు. కుటుంబంలో ఎంత మంది సభ్యులుంటే అంతమందికీ తలసరి ఐదు కిలోల చొప్పున రేషన్ బియ్యం అందించేలా చూడాలని చెప్పారు.

సంక్షేమం నుంచి సాధికారత దిశగా..
రాష్ట్రంలో ఇప్పటివరకు సంక్షేమ కార్యక్రమాల కోసం రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేయగా, అందులో రూ.75 వేల కోట్లు కేవలం పెన్షన్లకే కేటాయించినట్లు చంద్రబాబు తెలిపారు. ఆర్థిక అసమానతలను తగ్గించి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఇకపై కేవలం సంక్షేమంతో ఆగిపోకుండా, కుటుంబాలను సాధికారత వైపు నడిపించే ‘వెల్ఫేర్ టు ఎంపవరింగ్ ఫ్యామిలీస్’ విధానంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా సెర్ప్, మెప్మా ద్వారా ‘వన్ ఫ్యామిలీ.. వన్ ఎంట్రప్రెన్యూర్’ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేసి, ఐదు లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్దేశించారు.
యానాటి కొండ వర్గానికి ఎస్టీ ప్రయోజనాలు
ఈ సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లాలోని యానాటి కొండ సామాజిక వర్గాన్ని ఎస్టీల్లో చేర్చాలనే దీర్ఘకాల డిమాండ్‌ను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన చంద్రబాబు, ఒక సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చే అధికారం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని, అయితే ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు వారికి అండగా నిలవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు. బుడగజంగాల తరహాలోనే, యానాటి కొండ సామాజిక వర్గానికి కూడా ఎస్టీలకు వర్తించే అన్ని సంక్షేమ ప్రయోజనాలను అందించాలని తక్షణమే ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న కాపు కార్పొరేషన్ భవనాలను వెంటనే పూర్తి చేయాలని, వక్ఫ్ ఆస్తుల ద్వారా ఆదాయం పెంచేలా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.
‘ఫ్యామిలీ మ్యాపింగ్‌’పై ముఖ్య‌మంత్రి అసంతృప్తి
కులవృత్తులకు ఊతమిచ్చేలా, వాటికి విలువ జోడించే (వాల్యూ అడిషన్) కార్యాచరణ సిద్ధం చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. చేనేత, చేతివృత్తుల కేంద్రాలను కేవలం అమ్మకపు కేంద్రాలుగా కాకుండా, ప్రజలకు ఒక అనుభూతిని పంచే ‘ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు’గా తీర్చిదిద్దాలని దిశానిర్దేశం చేశారు. కాపు కార్పొరేషన్ రుణాల విషయంలో ఎక్కడైనా నిధులు అందుబాటులో ఉంటే తక్షణమే వాటిని వినియోగించాలని, నిధుల కొరత ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వ హయాంలో అనుసరించిన ‘ఫ్యామిలీ మ్యాపింగ్’ విధానంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విధానం వల్ల ఇష్టానుసారంగా పెన్షన్లు, ఇళ్లు కేటాయించారని, ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. మన కాన్సెప్ట్ ‘కంబైన్డ్ ఫ్యామిలీ’ అని, పెద్ద కుటుంబాలకు అధిక ప్రయోజనాలు చేకూరేలా నూతన విధానాలు రూపొందించాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు.మైనార్టీల సంక్షేమం, వక్ఫ్ బోర్డు ఆస్తుల నిర్వహణపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. వక్ఫ్ బోర్డుకు లెక్కలేనన్ని భూములు ఉన్నప్పటికీ, ఆదాయం మాత్రం నామమాత్రంగానే వస్తోందని అన్నారు. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయానికి ఒక్కరోజే రూ.7 కోట్ల ఆదాయం వస్తుంటే, వేల ఎకరాల ఆస్తులున్న వక్ఫ్ బోర్డు ఆదాయం ఎందుకు పెరగడం లేదని ప్రశ్నించారు. అధికారులు ఇప్పటికైనా చిత్తశుద్ధితో పనిచేసి, ఆస్తుల నుంచి ఆదాయం పెంచే మార్గాలు అన్వేషించి మైనార్టీ కమ్యూనిటీకి న్యాయం చేయాలని ఆదేశించారు. “మైనార్టీలు బలహీనంగా ఉన్నారు, వారి కోసం పనిచేయాల్సిన మీరూ బలహీనంగానే ఉన్నారు. ఇకనైనా వారికోసం గట్టిగా పనిచేయండి” అని అధికారులకు స్పష్టం చేశారు.

jayabherinews@gmail.com
Written by

jayabherinews@gmail.com