యాద‌గిరీశుడికి నేత్ర‌ప‌ర్వంగా కోటి పుష్పార్చ‌న‌

📰 Generate E-Paper Clip

కార్తీకోత్స‌వంలో భాగంగా తొలిసారి కోటి పుష్పార్చ‌న నిర్వ‌హ‌ణ‌

స్వామి వారి స‌హ‌స్ర‌నామాల‌తో మారుమ్రోగిన ఆల‌య ప్రాంగ‌ణం

జయభేరీ, యాదగిరిగుట్ట, నవంబర్ 19:

యాద‌గిరిగుట్ట శ్రీ‌ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి వారి దివ్య క్షేత్రంలో కోటి పుష్పార్చ‌న‌ను అర్చ‌కులు, వేద‌పండితులు నేత్ర‌ప‌ర్వంగా నిర్వ‌హించారు. కార్తీక‌మాసాన్ని పుర‌స్క‌రించుకొని కార్తీకోత్స‌వం కార్య‌క్ర‌మంలో భాగంగా కోటి పుష్పార్చ‌న‌ను తొలిసారిగా నిర్వ‌హించారు. గురువారం ప్రారంభ‌మైన‌ కోటి పుష్పార్చ‌న కార్య‌క్ర‌మం శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కు నిర్విరామంగా కొన‌సాగ‌నుంది. వేద‌పండితులు,అర్చ‌కులు స్వామి వారి స‌హ‌స్ర‌నామావ‌ళిని ప‌ఠిస్తూ కోటి నామాల‌తో కోటి పుష్పార్చ‌న‌ను నిర్వ‌హించ‌గా,ఆల‌య ప్రాంగ‌ణ‌మంతా స‌హ‌స్ర‌నామాల‌తో మారుమ్రోగింది. ఆల‌యంలో నిర్వ‌హించిన కోటి పుష్పార్చ‌న కార్య‌క్ర‌మం ద్వారా యాద‌గిరిగుట్ట క్షేత్రం మ‌రింత ఆధ్యాత్మిక శోభ‌ను సంత‌రించుకుంది. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి ప్రకృతి అనుకూల పరిస్థితులు నెలకొనాలని, సమస్త లోక కల్యాణం సిద్ధించాలని కోటి పుష్పార్చ‌న‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు, ఆలయ అర్చ‌కులు, వేద‌పండితులు తెలిపారు. కోటి పుష్పార్చ‌న సంద‌ర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వ‌చ్చిన భ‌క్తులు స్వామి, అమ్మ‌వార్ల‌ను ద‌ర్శించుకొని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆల‌య అర్చ‌కులు, వేద‌పండితులు కోటి పుష్పార్చ‌న విశిష్ట‌త‌ను భ‌క్తుల‌కు వివ‌రిస్తూ ఆశీర్వ‌దించారు. కోటి పుష్పార్చ‌న‌లో యాదగిరిగుట్ట ఆల‌య ఈవో భ‌వానీ శంక‌ర్‌తో పాటు ఆల‌య అధికారులు, సిబ్బంది,భ‌క్తులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

📰 Share Epaper Clip
jayabherinews@gmail.com
Written by

[email protected]

↑