ఖతార్ రాజధాని దోహా వేదికగా జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత షూటర్ నీరజ్ కుమార్ అద్భుత ప్రదర్శనతో మెరిశాడు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ విభాగంలో కాంస్య పతకం సాధించడంతో పాటు ప్రతిష్టాత్మక లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు. ఈ మెగా టోర్నీలో భారత్‌కు ఇది రెండో ఒలింపిక్ కోటా కావడం విశేషం. కొద్ది రోజుల క్రితం పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో జైపాల్ మాల్వియా రజత పతకంతో మొదటి ఒలింపిక్ బెర్త్ సాధించాడు.
ఫైనల్ పోరులో తీవ్ర ఒత్తిడిని తట్టుకుంటూ నీరజ్ కుమార్ మొత్తం 346.5 పాయింట్లు సాధించాడు. ఆఖరి క్షణాల్లో రజత పతకం కోసం గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, చివరి షాట్లో 9.4 స్కోరు నమోదు కావడంతో కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
వ్యక్తిగత పోరులో అద్భుత ప్రతిభ
న్యూట్రల్ అథ్లెట్‌గా బరిలోకి దిగిన డిమిత్రి పిమెనోవ్ 362.8 పాయింట్లతో జూనియర్ ప్రపంచ రికార్డు సృష్టిస్తూ స్వర్ణం గెలుచుకోగా, స్లొవేకియా షూటర్ పాట్రిక్ జానీ రజతం దక్కించుకున్నాడు. భారత్ తరఫున ఫైనల్ చేరిన మరో స్టార్ షూటర్ ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ 323.7 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. అర్హత రౌండ్లో నీరజ్ కుమార్ 591 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి తుది సమరానికి చేరుకున్నాడు.
టీమ్ ఈవెంట్లోనూ కాంస్య పతకం
వ్యక్తిగత విభాగంతో పాటు టీమ్ ఈవెంట్లోనూ భారత జట్టు కాంస్య పతకాన్ని ముద్దాడింది. నీరజ్ కుమార్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, అఖిల్ షెరాన్ త్రయం మొత్తం 1,751 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. కేవలం ఒక్క పాయింట్ తేడాతో రజత పతకాన్ని చేజార్చుకుంది. నార్వే 1,752 పాయింట్లతో రజతం, చెక్ రిపబ్లిక్ 1,754 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాయి. భారత నేవీలో విధులు నిర్వహిస్తున్న 26 ఏళ్ల నీరజ్ కుమార్, ఇటీవల ఐచి-నగోయా ఆసియా క్రీడల్లో రజతం గెలిచిన భారత జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఏకంగా ప్రపంచ స్థాయి వేదికపై వ్యక్తిగత, జట్టు పతకాలు గెలవడంతో పాటు ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకోవడంతో భారత షూటింగ్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.




