జయభేరి, విజయవాడ,సెప్టెంబర్ 30 :
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ గత రెండేళ్లలో విప్లవాత్మకమైన మార్పును సాధించింది. నిత్యం ఓవర్డ్రాఫ్ట్పై ఆధారపడే దయనీయ పరిస్థితి నుంచి సొంత కాళ్లపై నిలబడే స్వయం సమృద్ధి స్థాయికి రాష్ట్ర ఆర్థిక శాఖ చేరుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమలు చేస్తున్న కఠినమైన ఆర్థిక క్రమశిక్షణ, నిధుల వినియోగంలో పాటిస్తున్న విచక్షణ రాష్ట్ర ఆర్థిక మూలాలను పటిష్టం చేశాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి నెలా ఖజానా నిర్వహణకు, ఉద్యోగుల జీతభత్యాల కోసం ఓవర్డ్రాఫ్ట్ తీసుకోవడం సర్వసాధారణంగా మారగా.. ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందనడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక నివేదికలే అద్దం పడుతున్నాయి.ఆర్బీఐ విడుదల చేసిన ఫైనాన్షియల్ అకామడేషన్ అవైల్డ్ బై స్టేట్ గవర్నమెంట్స్ గణాంకాల ప్రకారం.. 2026 ప్రారంభ నెలల్లో ఏపీ ఆర్థిక క్రమశిక్షణ ఎంత వేగంగా పుంజుకుందో స్పష్టంగా తెలుస్తోంది.
2026 ఏప్రిల్ నెలలో రాష్ట్రం ఓవర్డ్రాఫ్ట్ సదుపాయాన్ని కేవలం ఒక్క రోజు మాత్రమే వినియోగించుకోగా , ఆ తర్వాతి నెల అయిన మే-2026 నాటికి ఓవర్డ్రాఫ్ట్ రోజుల సంఖ్య జీరోకు పడిపోయింది. అంటే మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఓడీ తీసుకోకుండా తన అవసరాలను స్వయంగా తీర్చుకోగలిగింది. దేశంలో పలు ఇతర రాష్ట్రాలు ఇప్పటికీ భారీగా ఓడీ, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులపై ఆధారపడుతుండగా.. ఆంధ్రప్రదేశ్ మాత్రం నెల రోజుల్లోనే ఓడీ రహిత రాష్ట్రంగా నిలవడం విశేషం.కేవలం ఓవర్డ్రాఫ్ట్ మాత్రమే కాకుండా, తాత్కాలిక నగదు కొరతను అధిగమించేందుకు తీసుకునే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ వినియోగం కూడా గణనీయంగా తగ్గిపోయింది. 2026 ఏప్రిల్ నెలలో 8 రోజుల పాటు సగటున రూ.1,996 కోట్ల చొప్పున డబ్ల్యూఎంఏ తీసుకోగా.. మే నెల నాటికి అది సగానికి సగం తగ్గి కేవలం 4 రోజులకు, సగటున రూ.466.25 కోట్లకు పరిమితమైంది. అలాగే ప్రభుత్వం తన వద్ద ఉన్న సెక్యూరిటీలను హామీగా ఉంచి తీసుకునే స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ కూడా ఏప్రిల్లో 25 రోజుల పాటు సగటున రూ. ₹7,181 కోట్లు ఉండగా, మే నాటికి 21 రోజులకు, సగటు మొత్తం రూ.6,225.92 కోట్లకు తగ్గింది. ఆర్బీఐ సదుపాయాలపై ప్రభుత్వం క్రమంగా ఆధారాన్ని తగ్గించుకుంటూ వస్తోందనడానికి ఈ సంఖ్యలే నిదర్శనం.గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా చేసిన అప్పులు, అడ్డగోలు నిధుల మళ్లింపులతో రాష్ట్ర ఖజానా దివాళా అంచున నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఆదాయ వనరులను సమర్థవంతంగా సమీకరించుకుంటూ, అనవసర ఖర్చులకు కళ్లెం వేస్తూ ఆర్థిక నిర్వహణను పకడ్బందీగా చేపట్టింది. సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూనే, అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తూ ఖజానాను స్వయం సమృద్ధి దిశగా నడిపించడంలో ఆర్థిక శాఖ విజయం సాధించింది. ఓవర్డ్రాఫ్ట్ అనే పదం వినపడకుండా సొంత రాబడులతో రాష్ట్ర రథాన్ని ముందుకు తీసుకెళ్తున్న ప్రస్తుత ఆర్థిక నిర్వహణే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ప్రగతికి అసలైన వెన్నెముకగా నిలుస్తోంది.





