విశాఖలో మల్లారెడ్డి వర్శిటీ

జయభేరి, విశాఖపట్టణం, సెప్టెంబర్ 30 :
తెలంగాణలో బలమైన ఇంజనీరింగ్, మెడికల్ , ప్రైవేట్ విశ్వవిద్యాలయ వ్యవస్థను నిర్మించిన బిఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి చామకూర మల్లా రెడ్డి.. ఇప్పుడు తన దృష్టిని ఆంధ్రప్రదేశ్ వైపు సారిస్తున్నారు. తెలంగాణలో మల్లా రెడ్డి యూనివర్సిటీ’తో పాటు డీమ్డ్ విశ్వవిద్యాలయ హోదాతో విద్యా రంగాన్ని ఏలిన మల్లా రెడ్డి గ్రూప్, ఆంధ్రప్రదేశ్‌లో తన విద్యా వ్యాపారాన్ని అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఏపీలోని ప్రధాన నగరాలు, ఉమ్మడి జిల్లాలను లక్ష్యంగా చేసుకుని రీజినల్ క్యాంపస్‌లు, శాటిలైట్ క్యాంపస్‌లు , ఆఫ్‌-క్యాంపస్ సెంటర్ల ఏర్పాటుకు మల్లా రెడ్డి విద్యా సంస్థల యాజమాన్యం ప్రణాళికలను వేగవంతం చేసింది.ఈ విస్తరణ ప్రణాళికలో భాగంగా ఏపీ ఐటీ, ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో మల్లా రెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ ఆఫ్-క్యాంపస్ పేరుతో భారీ ఆఫ్‌-క్యాంపస్ సెంటర్‌ను ఇప్పటికే ప్రారంభించారు. యూజీసీ అనుమతులతో ఏర్పాటు చేసిన ఈ క్యాంపస్‌లో ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, హెల్త్‌కేర్ విభాగాల్లో అత్యాధునిక కోర్సులను ఆఫర్ చేస్తున్నారు. విశాఖతో పాటు రాజధాని అమరావతి పరిధిలోని విజయవాడ, గుంటూరు బెల్ట్‌తో పాటు రాయలసీమ కేంద్రమైన తిరుపతి, కర్నూలు జిల్లాల్లోనూ కొత్త క్యాంపస్‌ల నిర్మాణానికి భూముల సేకరణ, అనుమతుల ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తున్నట్లు సమాచారం.

తిరుపతిలో ఓ కాలేజీని కొని ఇప్పటికే ఆఫ్ క్యాంపస్ ను ప్రారంభించారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల స్థాపనకు ఇస్తున్న ప్రోత్సాహకాలు మల్లా రెడ్డి గ్రూప్‌కు కలిసివస్తున్నాయి. తెలంగాణకు చెందిన వేలాది మంది ఏపీ విద్యార్థులు ప్రతిఏటా మల్లా రెడ్డి విద్యాసంస్థల్లో చేరుతున్నందున నేరుగా ఏపీలోని స్థానిక ప్రాంతాల్లోనే నాణ్యమైన మౌలిక వసతులతో క్యాంపస్‌లను అందుబాటులోకి తెస్తే డిమాండ్ మరింత పెరుగుతుందని యాజమాన్యం అంచనా వేస్తోంది. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ఎఐ , డేటా సైన్స్, పారామెడికల్ . లైఫ్ సైన్సెస్ కోర్సులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఏపీ విద్యార్థులను ఆకట్టుకునే వ్యూహంతో అడుగులు వేస్తున్నారు.మల్లా రెడ్డి విద్యా సంస్థల ఈ అగ్రెసివ్ నెట్‌వర్క్ విస్తరణతో ఆంధ్రప్రదేశ్‌లోని సంప్రదాయ ప్రైవేట్ కాలేజీలు , కార్పొరేట్ విద్యా సంస్థలకు గట్టి పోటీ ఎదురుకాబోతోంది. పొలిటికల్ ఇమేజ్, బ్రాండ్ మార్కెటింగ్, తక్కువ రుసుములతో కూడిన హామీలు, ప్లేస్‌మెంట్స్ నెట్‌వర్క్‌ను చూపించి ఏపీ ఉన్నత విద్యా మార్కెట్‌లో తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని మల్లా రెడ్డి గ్రూప్ చూస్తోంది. రాబోయే రెండు మూడేళ్లలో ఏపీలోని ప్రధాన జిల్లాలన్నింటికీ తమ విద్యా నెట్‌వర్క్‌ను విస్తరించి, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తిరుగులేని విద్యా సామ్రాజ్యంగా ఎదగడమే లక్ష్యంగా మల్లా రెడ్డి తన ప్లాన్‌ను అమలు చేస్తున్నారు

jayabherinews@gmail.com
Written by

[email protected]

↑