యోగికి చెక్ పెడతారా...
పార్టీలో… యూపీ ప్రభుత్వంలో యోగికి కంట్లో నలుసులా తయారైన డిప్యూటీ సీఎం కేపీ మౌర్యకు బీజేపీ అధ్యక్షుడిని చేయడం ద్వారా… యోగి హవాకు బ్రేక్ వేయాలని పార్టీలో మరో వర్గం ప్రయత్నిస్తోందా? పార్లమెంట్ ఎన్నికల్లో సగం సీట్లు కోల్పోవడం… యోగి ప్రత్యర్థులు ఆయుధంగా మార్చుకున్నారనే టాక్ వినిపిస్తోంది.
లక్నో, జూలై 23 ;
యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌కు చెక్ పడేలా బీజేపీలో అడుగులు పడుతున్నాయా? పార్టీలో… యూపీ ప్రభుత్వంలో యోగికి కంట్లో నలుసులా తయారైన డిప్యూటీ సీఎం కేపీ మౌర్యకు బీజేపీ అధ్యక్షుడిని చేయడం ద్వారా… యోగి హవాకు బ్రేక్ వేయాలని పార్టీలో మరో వర్గం ప్రయత్నిస్తోందా? పార్లమెంట్ ఎన్నికల్లో సగం సీట్లు కోల్పోవడం… యోగి ప్రత్యర్థులు ఆయుధంగా మార్చుకున్నారనే టాక్ వినిపిస్తోంది.
ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు అత్యంత సన్నిహితుడైన మౌర్యను 2017లోనే యూపీ ముఖ్యమంత్రిగా నియమించాలనుకున్నప్పటికీ.. యోగీ ఆదిత్యనాథ్ రంగంలోకి దిగడంతో అది సాధ్యం కాలేదు. మౌర్యకూ యోగికీ పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నట్లు విభేదాలున్నాయని, యోగి ప్రతి కదలికనూ ఆయన ఢిల్లీకి చేరవేస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పలు సీట్లు కోల్పోవడంపై యోగిని జవాబుదారీ చేయాలని అధిష్ఠానం భావిస్తోంది. అయితే, ఈ ఓటమితో తనకు సంబంధం లేదని, తనను సంప్రదించకుండా అభ్యర్థులను ఎంపిక చేశారని యోగి అన్నట్లు సమాచారం.
త్వరలో యూపీలో పది అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికలు యోగి భవిష్యత్తును నిర్ణయించవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ ఉప ఎన్నికలకు ముందే బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా కేశవ్ ప్రసాద్ మౌర్యను నియమిస్తారా..? లేదా..? అన్నదానిపై స్పష్టత లేదు.మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మౌర్యనే జాతీయ అధ్యక్షుడిగా నియమించడం ద్వారా యోగిని ఇరకాటంలో పెట్టాలని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఇటీవల బీజేపీ పెద్దలను కలిసిన మౌర్య… పార్టీ కంటే ఎవరూ గొప్పవారు కాదన్న వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. యూపీ సీఎం యోగిని దృష్టిలో పెట్టుకునే ఆయనీ వ్యాఖ్యలు చేశారంటున్నారు. మొత్తానికి యోగి ఆధిపత్యానికి చెక్ చెప్పేలా అడుగులు పడుతున్నాయంటున్నారు.
Post Comment