రైతుబంధును బంజేసే కుట్ర: హరీశ్ రావు..!!
రైతుబంధు కన్నా బోనస్ మేలన్న మంత్రి వ్యాఖ్యలే నిదర్శనం... ఇప్పటిదాకా ఇచ్చిన బోనస్ రూ.26 కోట్లేనన్న బీఆర్ఎస్ నేత
జయభేరి, హైదరాబాద్ : రైతుబంధును పూర్తిగా బంద్ పెట్టేందుకు రాష్ట్ర సర్కారు కుట్రలు చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.
రాష్ట్రంలో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే.. 5,19,605 క్వింటాళ్ల సన్న వడ్లకు మాత్రమే రూ.500 బోనస్ ఇచ్చినట్టు సర్కారు ప్రకటించిందని, ఆ లెక్కన రైతులకు దక్కింది రూ.26 కోట్లేనని అన్నారు. రైతుబంధు కింద అయితే ఏడాదికి రైతుల ఖాతాల్లో రూ.7,500 కోట్లు జమ చేయాల్సి ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా రూ.15 వేల చొప్పున ఇస్తే ఆ మొత్తం ఇంకా ఎక్కువ అవుతుందన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధును ఆపేస్తారని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ముందే హెచ్చరించారన్నారు. అన్నట్టుగానే రేవంత్ సర్కార్ ఆ దిశగా అడుగులు వేస్తున్నదన్నారు. మహబూబ్నగర్ రైతు పండుగ సదస్సులో రైతుభరోసా గురించి ప్రకటన చేస్తారనుకుంటే.. ఉసూరుమనిపించారని విమర్శించారు. రేవంత్ వ్యాఖ్యలు వింటుంటే.. రైతులపై ప్రేమకన్నా కూడా గిరిజనుల నుంచి భూసేకరణ చేయడంలో ఘోరంగా విఫలమయ్యామన్న ఆవేదనే కనిపిస్తున్నదన్నారు.
అభివృద్ధి జరగాలంటే రైతులు నష్టపోవాలంటున్నారని, పాలమూరు సభ సాక్షిగా రైతులను బెదిరించారన్నారు. ''కేసీఆర్కు వెయ్యి ఎకరాల ఫామ్హౌస్ ఉన్నట్టు నిరూపిస్తావా?' అని సీఎంకు ఆయన సవాల్ విసిరారు. నిరూపించలేకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Post Comment