Greater HYD Politics I గ్రేటర్‌లో ముగ్గురు వలస నేతలకు టికెట్లు...
గ్రేటర్ వలస నేతలకు కాంగ్రెస్ కేడర్.. క్యాడర్ మద్దతుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి
గ్రేటర్ హైదరాబాద్‌లో వలస నేతలకు కాంగ్రెస్ అధిష్టానం పెద్దపీట వేసింది. ఇన్నాళ్లుగా పార్టీ జెండాను మోస్తున్న సీనియర్లను కానీ.. తాజాగా కాంగ్రెస్ కండువా కప్పుకున్న నేతలను కానీ పార్టీ అంగీకరించలేదు.
సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన్ నాగేందర్, మల్కాజిగిరి నుంచి జెడ్పీ చైర్‌పర్సన్ పట్నం సునీతామహేందర్ రెడ్డి, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. తాజాగా కారు దిగి హస్తం గూటికి చేరిన వారు ఈ ముగ్గురే కావడం గమనార్హం. ఇతర పార్టీల నుంచి కొత్తగా చేరిన కాంగ్రెస్ కు టికెట్లు కేటాయించడంతో మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వారికి నిరాశ తప్పడం లేదు. పార్టీ నాయకత్వ తీరుపై అక్కడక్కడా పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి మొదలైంది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్‌లో మాత్రం ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కనీస ప్రాతినిధ్యం లేకపోవడంతో లోక్ సభ ఎన్నికలను అధికార కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై దృష్టి సారించి గ్రేటర్ హైదరాబాద్‌లోని నాలుగు స్థానాల్లో కనీసం మూడింటినైనా కైవసం చేసుకునేలా సీఎం వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగానే ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి చేర్చుకునే పనిలో పడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో చేవెళ్ల టిక్కెట్టు ఆశించిన ఎమ్మెల్సీ, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునీతారెడ్డి కారు దిగి కాంగ్రెస్ లో చేరారు. దీంతో ఆమెకు మల్కాజిగిరి సీటు కేటాయించారు. ఆ తర్వాత సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి కూడా చేవెళ్ల సీటును ఆశించి... కారు దిగి కాంగ్రెస్ లో చేరి మరోసారి చేవెళ్ల టికెట్ దక్కించుకున్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన్ నాగేందర్ సికింద్రాబాద్ టిక్కెట్టు దక్కించుకున్నారు. ఆయనతో పాటు ప్రస్తుత హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్‌రెడ్డి దంపతులు కూడా సికింద్రాబాద్, మల్కాజిగిరి సీటు దక్కకపోవడంతో కాంగ్రెస్‌లో చేరినా.. వారికి ఇక్కడ భంగపాటు తప్పలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాజీ ఎమ్మెల్యే హన్మంతురావు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయాడు. మళ్లీ లోక్‌సభలో అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు. మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి మైనంపల్లి హన్మంతరావు టికెట్ ఆశిస్తున్నారు. ఆయనతో పాటు నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, సినీ నటుడు అల్లు అర్జున్ మామ ఇబ్రహీంపట్నం కారు పార్టీ సీనియర్ నాయకుడు కంచర్ల చంద్రశేఖర్ కూడా ఇదే మల్కాజిగిరి సీటును ఆశించగా వారికి టిక్కెట్ దక్కలేదు. అనూహ్య పరిణామాల మధ్య వికారాబాద్ జెడ్పీ చైర్‌పర్సన్ పట్నం సునీతామహేందర్‌రెడ్డికి మల్కాజిగిరి టిక్కెట్టు కేటాయిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. నిన్నగాక మొన్న పార్టీలో చేరిన నేతలకే పార్టీ టికెట్ కేటాయించడంతో గ్రౌండ్ లెవల్ క్యాడర్ వారి గెలుపునకు సహకరిస్తుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.
Post Comment