వెంటాడుతన్న షర్మిళ
జగన్ ప్రభుత్వం ఐదేళ్ల పాటు చేసిన అవినీతి, అరాచకాలు ఇవేనంటూ బయటపెట్టారు. ఇలా జగన్ పంటి కింద రాయిలా వైెఎస్ షర్మిల మారారు. కానీ అన్ని చోట్ల పోటీ చేసినా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎక్కడా గెలవలేదు. కనీసం కడప పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఆమె స్వయంగా పోటీ చేసినా గెలుపు సాధించలేకపోయారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చాయి. జగన్ దారుణ ఓటమిని చూశారు.
కడప, జూలై 23 :
వైఎస్ షర్మిల తన సోదరుడు వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా ఎన్నికల సమయంలో సుదీర్ఘ పోరాటం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నుంచి ఎన్నో విషయాలు ఆమె ఎన్నికల సమయంలో ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశారు.
ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ షర్మిలను రాజకీయంగా విమర్శలు చేసిన జగన్ ఫలితాల తర్వాత ఆమె గురించి ఎక్కడా ప్రస్తావించడం మానేశారు. అంటే వైఎస్ షర్మిలను తాను నేతగా కూడా గుర్తించలేదని అర్ధమవుతుంది.కానీ ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ షర్మిల జగన్ ను వదలి పెట్టడం లేదు. వెంటపడుతూనే ఉన్నారు. వైఎస్ అభిమానులకు ఇది కొంత ఆందోళన కల్గిస్తుంది. జగన్ ఢిల్లీలో ధర్నా చేయడానికి వెళుతుంటే దానిపై కూడా షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. జగన్ ఐదేళ్ల పాటుహత్యా రాజకీయాలు చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. సొంత చెల్లెళ్లకు జగన్ వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. బాబాయి హత్యపై ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదని ప్రశ్నించారు.
వివేకా హంతకులతో జగన్ కలిసి తిరుగుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో ఉండకుండా జగన్ ఏం చేస్తారని ప్రశ్నించారు. వినుకొండ హత్య వ్యక్తిగత హత్యేనని.. రాజకీయమైంది కాదంటూ జగన్ ను వదలకుండా వెంట పడుతుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అధికారంలో ఉన్నన్ని రోజులు జగన్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదన్నారు. పోలవరం ప్రాజెక్టును, కడప, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీల గురించి పట్టించుకోలేదని మండిపడ్డారు. అదే సమయలో మూడు రాజధానుల పేరుతో ప్రజలను గందరగోళానికి గురిచేశారని.. వీటన్నిటిపై ఏనాడూ ధర్నా చేయలేదు ఎందుకని ప్రశ్నించారు. మీ పార్టీ కార్యకర్త చనిపోతే ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తారాయ.. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా తప్పించుకునేందుకే ఈ ఎత్తు వేశారని ఆరోపించారు.
మీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నదే 11 మంది, ఉన్న ఆ కొద్దిమందైనా అసెంబ్లీలో చర్చలో పాల్గొనరా .. ప్రజావ్యతిరేక బిల్లులపై పాలకపక్షంతో కొట్లాడే అవసరం మీకు లేదనుకుంటున్నారా అని జగన్ ను సూటిగా నిలదీశారు. ఓవైపు రాష్ట్రంలో భారీ వర్షాలకు చాలా మంది జనం వరదల్లో చిక్కుకున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఇల్లూ వాకిలీ నీట మునగడంతో దిక్కుతోచక రోదిస్తున్నారని షర్మిల గుర్తు చేశారు. వారిని పరామర్శించి ధైర్యం చెప్పాలని ఎందుకు అనిపించడం లేదన్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లు ప్రజల కోసం పనిచేయలేదు కానీ ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తారంట.. సిగ్గుండాలి కదా అంటూ జగన్ పై షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.
Post Comment