జోరుగా మట్టి దందా... బేస్ మెంట్ పేరిట మట్టి విక్రయాలు...
తెరవెనుక కాంగ్రెస్ నేత... అధికారులకు సమాచారం అందిస్తామంటూ చేతులు దులుపుకుంటున్న వైనం...
జయభేరి, ఏప్రిల్ 3: మూడు చింతలపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో మట్టి దందా జోరుగా సాగుతోంది. రెవిన్యూ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీస్కుంటుండడంతో అక్రమార్కులు రూటు మార్చి చెరువులు, కుంటలు, అటవీ భూముల పై కన్నేశారు.
బేస్ మెంట్ పేరిట మట్టి బయటకి...
కొల్తుర్ గ్రామ పరిధిలో ఉన్న చెరువులో నుంచి కొందరు అక్రమార్కులు మట్టిని తవ్వేస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు దగ్గరుండి బేస్మెంట్ పేరిట మట్టిని తరలించారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు రావడంతో విచారణకు వెళ్లిన అధికారులు ఫోటోలకు ఫోజులిచ్చామ అన్నట్టుగా మొక్కుబడిగా ఫోటోలు తీసుకొని వెనక్కి వచ్చారు. సామాన్య ప్రజలు తమ అవసరాలకు మట్టిని తవ్వెందుకు అనుమతులు అడిగితే ససేమిరా అంటూ ఆగమేఘాల పై విచారణ జరిపి కేసులు నమోదుచేస్తారు. అలాంటిది ఆ నేత కొన్ని వందల త్రిప్పుల మట్టిని అక్రమంగా అనుమతులు లేకుండా మట్టిని బయటకి తరలిస్తే మాత్రం చర్యలు శూన్యమా అంటూ సామాన్యుడికి ఒక న్యాయం బడా బడా నాయకులుగా చెలామణి అయ్యే వారికి ఒక న్యాయమా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం... మముళ్ళతో మేనేజ్....
అక్రమంగా చెరువులో నుంచి మట్టి తరలించారని ఫిర్యాదు చేసిన ఇర్రిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు అంటున్నారు. చెరువులను, కుంటలను కాపాడాల్సిన అధికారులే అక్రమార్కులతో చేతులు కలిపి భక్షిస్తున్నారని ప్రజలు బహిరంగంగా నే చర్చించుకుంటున్నారు. మట్టిని తవ్వాలంటే ముందుగా మైనింగ్, ఇర్రిగేషన్ శాఖ ల నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అక్రమార్కులు మాత్రం ఇర్రిగేషన్ శాఖ అధికారులను మేనేజ్ చేస్తూ నిబంధనలను తుంగలో తొక్కి సహజ సంపదను కొల్లగొడుతూ లక్షలు సంపాదిస్తున్నారు. వచ్చేది వర్షం కాలం ఇలా చెరువులను బేస్మెంట్ పేరిట తవ్వుకుంటూ పోతే గుంతలు పెద్దగా ఏర్పడి పశువులు చనిపోవడం కానీ ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు భాద్యత వహిస్తారని ప్రజలు మండిపడుతున్నారు. ఏమైనా అంటే మా పై అధికారులకు సమాచారం అందిస్తాం అంటూ ఇరిగేషన్ అధికారులు చేతులు దులుపేసుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు నిద్రమత్తులో నుంచి తేరుకొని విచారణ చేపట్టి అక్రమార్కుల పై కఠిన చర్యలు తీసుకోవాలని లేదంటే కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని అధికారులను హెచ్చరిస్తున్నారు...
ఇరిగేషన్ అధికారుల వివరణ కోరగా... చర్యలు తీసుకుంటాం... స్వప్న, ఇర్రిగేషన్ ఏఈ
మాకు మట్టిని తవ్వి బయటకి తరలిస్తున్నారని వచ్చిన ఫిర్యాదు వాస్తవమే. విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం మా పై అధికారులకు విషయం తెలియజేస్తా..
Post Comment