ఆశల పల్లకీలో కొత్త బడ్జెట్...
దేశ జిడిపిలో 3.4% ప్రాతినిధ్యం వహిస్తున్న మౌలిక సదుపాయాల రంగానికి 2024, 25 ఆర్థిక సంవత్సర మధ్యంతర బడ్జెట్‌లో రూ. 11.11 లక్షల కేటాయింపులు జరిగాయి. ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్‌లో కేటాయింపులు మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటించిన స్థాయితో సమానంగా ఉండవచ్చు. ఆ కేటాయింపులు 2.6 ట్రిలియన్ కోట్ల రూపాయల వరకు ఉండవచ్చునని రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ఒక అధికారి అంచనా ప్రకారం తెలుస్తోంది. ఫిబ్రవరిలో 2024-25 మధ్యంతర బడ్జెట్ సమర్పించినప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మౌలిక సదుపాయాల కల్పనలో గణనీయమైన ప్రగతిని సాధించినట్టు ప్రకటించారు.
మౌలిక సదుపాయాల రంగంపై బడ్జెట్‌లో కేటాయింపులు అంత ఎక్కువ కాకుండా నెమ్మదించాలని ఒత్తిడి ఉన్నప్పటికీ రైల్వే రంగం పై మాత్రం వచ్చే బడ్జెట్‌లో కేటాయింపులు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. కనీసం ఎలా లేదనుకున్నా ఆర్థికంగా ప్రభుత్వం చేయూత ఇవ్వక తప్పదు.
2022, 23 ఆర్థిక సంవత్సరంలో రూ.1.37 లక్షల కోట్ల స్థూల బడ్జెట్ మద్దతు ఉండగా, అంతకు ముందటి సంవత్సరం అనుసరించిన బడ్జెట్ ట్రెండే కొనసాగింది. ఈ కేటాయింపు 2013, 14 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన మొత్తం కంటే తొమ్మిది రెట్లు ఎక్కువని సీతారామన్ ప్రకటించారు.ఇప్పుడు ఫిబ్రవరి నాటి మధ్యంతర బడ్జెట్‌లో కొన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారు. రైల్వే కారిడార్లు, పిఎం గతిశక్తి పథకం కింద మూడు ప్రధార రైల్వే కారిడార్లు గుర్తించారు. ఇవన్నీ లాజిస్టిక్ సామర్థాన్ని మెరుగుపర్చడం, ఖర్చులను తగ్గించడం తదితర లక్షాలతో కూడుకున్నాయి.
కారిడార్లలో ఎనర్జీ, మినరల్, సిమెంట్ కారిడార్లు, పోర్టు కనెక్టివిటీ కారిడార్లు, హైట్రాఫిక్ డెన్సిటీ కారిడార్లు, రైల్వే అప్‌గ్రేడ్లు ఉన్నాయి. రైల్వే వ్యవస్థను ఆధునీకరించే క్రమంలో 40 వేల సాధారణ రైలు బోగీలను వందేభారత్ ప్రమాణాలతో మార్పు చేయనున్నారు. రాబోయే 25 సంవత్సరాలలో లక్ష కిలో మీటర్ల ట్రాక్‌ను వేయాల్సిన అవసరం ఉందని అంచనా. మరిన్ని సరకుల తరలింపు రోడ్ల నుండి రైల్వేలకు మారే అవకాశం కనిపిస్తోంది. 15 సంవత్సరాలలో 7000 నుంచి 8000 కొత్త రైలు సెట్‌లను కొనుగోలు చేయడానికి రూ. లక్ష కోట్ల ప్రణాళికను ప్రతిపాదించారు. ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ సమర్పిస్తారు కాబట్టి ఈ మేరకు మౌలిక సదుపాయాల రంగానికి ఆర్థిక ప్రోత్సాహం కొనసాగిస్తారన్న ఆశలు కనిపిస్తున్నాయి. మధ్యంతర బడ్జెట్‌లో రోడ్లు, జాతీయ రహదార్ల నిర్మాణానికి రూ. 2.78 ట్రిలియన్ కోట్లు కేటాయించారు.
ఈ నిధులు వ్యయం దాదాపు పూర్తి కావస్తోంది. తరువాత భారీ కేటాయింపులు రైల్వేకు అవసరమవుతాయి. రైల్వేలపై ఖర్చు చేయడంలో మాంద్యం పనికి రాదు. ఎందుకంటే రవాణా ఖర్చును జిడిపి శాతం ప్రకారం తగ్గించాలన్న లక్షం నెరవేర్చక తప్పదు. రైల్వే మౌలిక సదుపాయాలకు సంబంధించి వ్యాగన్లు, కోచ్‌లు, సిగ్నలింగ్, కొత్త లైన్లు, గేజ్ మార్పిడి, హైస్పీడ్ రైళ్లు ఈ విధంగా ప్రతి విభాగానికి భారీగా పెట్టుబడి పెట్టవలసి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల జరిగిన ఘోర రైలు ప్రమాదం, కవచ్ ఆటోమేటిక్ రైలు భద్రత వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ప్యాసింజర్ల భద్రత, సౌకర్యాలకే కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటోంది.
మూలధన వ్యయం (కాపెక్స్) మాటల్లో చెప్పాలంటే జిబిఎస్ (గ్రాస్‌బడ్జెటరీ సపోర్టు) వాటా గత కొన్నేళ్లుగా పెరుగుతోంది. అదే సమయంలో అదనపు బడ్జెట్ వనరులు (ఇబిఆర్)బాగా తగ్గాయి. ఈ మేరకు ఐఆర్‌ఎఫ్‌సి, ఇనిస్టిట్యూషనల్ ఫైనాన్సింగ్, ఎఫ్‌డిఐ, పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్స్ ఇవన్నీ ఇబిఆర్‌లో సమన్వయం కావలసి ఉంటుంది.ఇబిఆర్ దిశగా కేటాయింపులు చేయడమంటే పెట్టుబడులు పెట్టడంలో ప్రభుత్వం ఆలస్యం చేసే అవకాశం ఉంటుంది. బడ్జెట్ మద్దతుతో ఎక్కువ నిధులు వ్యయం చేయడానికి వీలవుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం కూడా సీరియస్‌గా నిధుల ఖర్చును పర్యవేక్షించ గలుగుతుంది.
ఈ నేపథ్యంలో రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా రికార్డు స్థాయిలో రూ. 2.11 ట్రిలియన్ కోట్లు డివిడెండ్ రూపంలో ప్రభుత్వానికి సమకూర్చడానికి సిద్ధమవుతోంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం అత్యంత నైపుణ్యంగా వ్యయం చేయవలసి వస్తుంది. భారీ వినియోగానికి, ఉన్నతమైన పెట్టుబడి ప్రణాళికలకు మధ్య సమతూకం పాటించక తప్పదు. పూర్తి బడ్జెట్‌లో కేటాయించిన నిధులు కొంత వరకు ప్రైవేట్‌పరంగా వినియోగించడానికి మళ్లిస్తారన్న భయాందోళనలు మొదట్లో తలెత్తాయి. ఫలితంగా రోడ్లు, రైల్వేలు వంటి రంగాలకు నిధుల వ్యయంలో కోత కనిపించేది. కానీ ఇప్పుడు ఆయా రంగాలకు నిధుల కేటాయింపునకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.
Post Comment