విభజన సమస్యలు కొలిక్కివచ్చేనా....
మొదటి ఐదేళ్లు రాజ్ భవన్ కేంద్రంగా.. గవర్నర్ సమక్షంలో చర్చలు జరిగినా ఒక్క సమస్య పరిష్కరించుకోలేకపోయారు. తర్వాత ఐదేళ్లు అసలు చర్చలే జరగలేదు. పట్టించుకోలేదు. ఇప్పుడు విభజన చట్టానికి పదేళ్లు పూర్తయ్యాయి. ఇప్పుడు ప్రభుత్వాలు మారడంతో విభజన సమస్యలను పరిష్కరించుకోవాలని మరోసారి ప్రయత్నాలు ప్రారంభించాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం... ఏపీ, తెలంగాణగా విడిపోయి పదేళ్లు దాటిపోయింది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది. ఇప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదు. విభజన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఆస్తుల విభజన, విద్యుత్ బిల్లుల బకాయిలు వంటి అనేక సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. విభజన సమస్యల పరిష్కారం అంత సులువు కాదు.తెలుగు రాష్ట్రాల మధ్య పదేళ్లుగా పరిష్కారం కాని సమస్యలే.
ఇలాంటి ప్రచారాల వల్ల రాజకీయంగా నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతో ఎలాంటి ముందడుగు వేయలేని పరిస్థితులు ఉన్నాయిఅధికారిక వర్గాల ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య చట్టంలోని షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో జాబితా చేసిన వివిధ సంస్థలు, కార్పొరేషన్ల విభజన, అనేక అంశాలపై ఇంకా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇంకా పూర్తి కాలేదు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 89 ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లు తొమ్మిదో షెడ్యూల్‌లో జాబితా చేశారు. చట్టంలోని 10వ షెడ్యూల్‌లో ఏపీ స్టేట్ కో-ఆపరేటివ్ యూనియన్, ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, ఏపీ ఫారెస్ట్ అకాడమీ, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ , ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ వంటి 107 శిక్షణా సంస్థలు ఉన్నాయి.
రిటైర్డ్ బ్యూరోక్రాట్ షీలా భిడే నేతృత్వంలోని నిపుణుల కమిటీ షెడ్యూల్ 9,10 షెడ్యూల్ సంస్థల విభజనపై సిఫార్సులు చేసినప్పటికీ, ఈ అంశం అపరిష్కృతంగానే ఉంది. విభజన తర్వాత విద్యుత్ సరఫరాకు సంబంధించి బకాయిల చెల్లింపు విషయంలో కూడా రెండు రాష్ట్రాల మధ్య చర్చలు ముందుకు సాగలేదు. అలాగే ప్రభుత్వ ఆధీనంలోని రోడ్డు రవాణా సంస్థ ఆస్తులపై రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు ఒక కొలిక్కి రాలేదు. రాజధాని నగరమైన హైదరాబాద్‌లో ఉన్న ఆర్టీసీ ఆస్తుల్లో వాటా కావాలని ఏపీ కోరిందని, దానికి టీఎస్‌ఆర్‌టీసీ నిరాకరించింది.
హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ ఆస్తులు తెలంగాణకు చెందినవేనని.. తెలంగాణ గడ్డపై ఉన్న ఆస్తుల్లో ఏపీకి వాటా ఎలా ఇస్తారని తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. ఈ ఏడాది మార్చి నెలలో కేంద్రం రెండు రాష్ట్రాలకు భూ కేటాయింపులు చేయడంతో ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌పై వివాదం సద్దుమణిగింది. విభజన చట్టం ఆధారంగా 58:42 ప్రకారం రెండు రాష్ట్రాలు భవన్ ఆస్తులు పంచుకున్నాయి.
అశోకా రోడ్డుతో పాటు శ్రీమంత్ మావరావు సింథియా మార్గ్ లో కలిపి రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా 19. 733 ఎకరాల భూమి ఉంది. అశోకా రోడ్డులోని 8. 726 ఎకరాల్లో ఏపీ-తెలంగాణ భవన్ ఉంది. ఉమ్మడి భవన్ లో ఏపీ వాటా 4.3885 ఎకరాలు (విలువ రూ.1,703.6 కోట్లు), తెలంగాణ వాటా 4.3375 ఎకరాలు (రూ.1,694.4 కోట్లు)గా ఉంది. 0.511 ఎకరాల రోడ్డులో రెండు రాష్ట్రాలకు చెరో 0.2555 ఎకరాలు (రూ.160 కోట్లు) ఉంది. ప్రస్తుతం తెలంగాణ కింద ఉన్న గోదావరి బ్లాక్ 4.082 ఎకరాలు (రూ.1,614.40 కోట్లు), నర్సింగ్ హాస్టల్ 3. 367 ఎకరాలు (రూ.1,318 కోట్లు) ఉంది. ఏపీ కింద ఉన్న శబరి బ్లాక్ 4.133 ఎకరాలు (రూ.1,623.60 కోట్లు), పటౌడీ హౌస్ లోని 7.640 ఎకరాలు (రూ.2,394 కోట్లు) ఉంది. శ్రీమంత్ మాధవరావు సింథియా మార్గ్ లో 7.640 ఎకరాల విస్తీర్ణంలోని పటౌడీ హౌస్ వేరుగా ఉంది.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తుది పరిష్కారం కోసం వేచి చూస్తున్న సమస్యల్లో ఉద్యోగుల బదిలీ అంశం ఇప్పటికీ తేలలేదు. ఏపీకి కేటాయించిన 144మంది తెలంగాణ ఉద్యోగులు ఇంకా అక్కడే పనిచేస్తున్నారు. వారు తమను తెలంగాణకు పంపాలని కోరుతున్నారు.విభజన సమస్యల పరిష్కారానికి పదేళ్లుగా జరిగిన ప్రయత్నాలు అంతంత మాత్రమే. 2014లో తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాయి. ఆస్తుల పంపకానికి అప్పటి గవర్నర్ నరసింహన్ నేతృత్వంలో రాజ్ భవన్ కేంద్రంగా కొన్ని సమావేశాలు జరిగాయి. కానీ గవర్నర్ తెలంగాణ వైపు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తూ దూరం జరిగింది.
పరిపాలన అమరావతికి మార్చుకోవడంతో.. సెక్రటేరియట్ లో ఏపీకి కేటాయించిన భవనాలు ఇవ్వాలని కేసీఆర్ ఒత్తిడి చేశారు. దానికి చంద్రబాబు అంగీకరించలేదు. అన్ని సమస్యలూ ఒకే సారి పరిష్కరించుకుందామన్నారు. తర్వాత ఏపీలో ప్రభుత్వం మారంది. జగన్ సీఎం అయ్యారు. కానీ కేసీఆర్ రెండో సారి సీఎం అయ్యారు. విజయవాడలో జరిగిన జగన్ ప్రమాణ స్వీకార ఉత్సవానికి కేసీఆర్ హాజరయ్యారు. తమ మధ్య బేసిన్లు, బేషజాలు ఉండవని ప్రకటించారు.దీంతో సమస్యలన్నీ పరిష్కారమవుతాయని అనుకున్నారు. కనీ సెక్రటేరియట్ లో ఏపీకి కేటాయించిన భవనాలను తెలంగాణకు ఇచ్చేశారు జగన్.
కానీ ఆ తర్వాత ఒక్క విభజన సమస్యపైనా చర్చ జరగలేదు. రాజకీయంగా కేసీఆర్, జగన్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ రాష్ట్ర సమస్యల అంశంపై చర్చించేందుకు ఇరు రాష్ట్రాల సీఎంలు ఆసక్తి చూపలేదు. ఒకరి, రెండు సార్లు సమావేశాలు జరిగినా అవి రాజకీయ కోణంలోనే జరిగాయి .మరి ధైర్యంగా ఇద్దరు నేతలు.. ఓ పరిష్కారానికి వస్తారా లేదా అన్నదే కీలకం. అదే జరిగితే.. ఓ అద్భుతం అనుకోవచ్చు. కానీ ఒక్క సమావేశంతో ఏదీ అవదని.. సానుకూలంగా ఉంటే.. మరికొన్ని సమావేశాల తర్వాత అయినా పరిష్కారం లభిస్తుందన్న ఆశతో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయనుకోవచ్చు.
Post Comment