ప్రజల కోసం సమాజం కోసం ఉమ్మడి హక్కుల కోసం పోరాడిన వారిని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి...
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం :: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క.
ములుగు జిల్లా: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని, ప్రజల కోసం సమాజం కోసం ఉమ్మడి హక్కుల కోసం పోరాడిన సర్వాయి పాపన్న గౌడ్ లాంటి వారిని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను అధికారికంగా జరపడం చాలా సంతోషకరమని అన్నారు. ప్రతి ఒక్కరూ మహనీయుల జీవిత చరిత్రను వారి త్యాగాలను గుర్తుంచుకోవాలని మర్చిపోతే మాత్రం మానవ మనుగడకు భవిష్యత్తు కష్టతరం అవుతుందని , " నాకోసం పనిచేస్తే నాలోనే ఉండిపోతావు - జనం కోసం పనిచేస్తే జనంలో ఉండిపోతావ్ "అని అన్నారు.
సర్దార్ సర్వాయి పాపన్న ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ ప్రాంతంలోని ఖిలషాపూర్ అనే గ్రామంలో జన్మించారని పశువుల కాపరిగా ఉంటూ రాజుల సైన్యాలను వారి ఆగడాలను ఎదిరించి, అరికట్టి ఉమ్మడి హక్కుల కోసం పోరాడారని, అన్యాయాలను ఎదిరించిన ఆయన జీవిత చరిత్ర మనకు ఆదర్శమని పేర్కొన్నారు. సమాజంలో గౌడ్ అన్నలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్యల పరిష్కరించడం కొరకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించేటట్లు చూస్తానని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన అవసరం ఉందని ఒక మామూలు మనిషి తన కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను ఎదురించాలని ఉద్దేశంతోనే తనతో ఎలాంటి సైన్యం లేకున్నా ఆస్తి అంతస్తులు లేకున్నా అప్పటి ప్రభువులు అధిక పన్నులు వసూలు చేస్తుంటే వారిని ఎదిరించి దాదాపు అనేక కోటలను తన ఆధీనంలోకి తెచ్చుకొని ప్రజలకు అండగా నిలిచారని పేర్కొన్నారు.
రాజులు రాజ్యాలు అంతరించిన అనంతరం భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని నేటికీ ప్రజలకు సమస్యలు ఎదురవుతే స్థానిక అధికారులకు తెలియజేయాలని లేదా రాజ్యాంగబద్ధంగా ప్రజలు అధికారులను ప్రశ్నించవచ్చని తెలిపారు. స్థానిక గౌడన్న సమస్యలను తమ పరిధిలో ఉన్నా వాటిని వెంటనే పరిష్కరించడం జరుగుతుందని అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా కల్లుగీత కార్మికులకు కాటమయ్య 100 రక్షక కవచాలు మంత్రి అందచేశారు. అనంతరం కలెక్టర్ కు మంత్రి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి.శ్రీజ, జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి శ్రీనివాస్, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి రవీందర్ రెడ్డి, సి ఈ ఓ సంపత్ రావు, ఎక్సైజ్ సి ఐ సుధీర్ కుమార్, బి.సి. కులస్థులు, బి.సి. సంఘ నాయకులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Post Comment