వైసీపీలో మండలి చిచ్చు

వైసీపీలో మండలి చిచ్చు

విజయవాడ, జూలై 25 :
వైసీపీలో అంతర్గత పోరు మొదలైంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని జగన్ ఢిల్లీ వేదికగా గళం ఎత్తారు. జాతీయ పార్టీల మద్దతు కూడగట్టారు. జంతర్ మంతర్ వద్ద జగన్ చేపట్టిన దీక్షకు సమాజ్ వాది పార్టీతో పాటు ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోనే శివసేన పార్టీ మద్దతు ప్రకటించింది. అఖిలేష్ యాదవ్ సంఘీభావం తెలిపారు.

శివసేన తరుపున ఎంపీ హాజరయ్యారు. ఏపీలో నరమేధం కొనసాగుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఒకవైపు జాతీయ స్థాయిలో జగన్ ఇతరుల మద్దతు పొందుతుండగా.. ఏపీలో వైసీపీ నుంచి నేతల నిష్క్రమణ ప్రారంభమైంది. అది కూడా కీలకమైన గుంటూరు జిల్లా నుంచి. నిన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి వైసిపికి గుడ్ బై చెప్పారు. 2019 ఎన్నికల్లో టిడిపి నుంచి గెలిచారు ఆయన. కొద్ది రోజులకే వైసీపీలోకి ఫిరాయించారు. కానీ ఎన్నికల్లో మద్దాలి గిరికి జగన్ టికెట్ ఇవ్వలేదు. విడదల రజినీకి టికెట్ కేటాయించారు. మద్దాలి గిరి సహకరించారు. అయినా సరే వైసీపీలో ఆయనకు సరైన గుర్తింపు లభించలేదు.

Read More ఏపీలో విచిత్రమైన ఘటన జరిగింది. రైలు పేరొకటి.. కానీ వెళ్లే రూటు మరొకటి.

ఇక ఆ పార్టీలో ఉండడం వేస్ట్ అని నిర్ధారించుకున్న గిరి.. వైసీపీకి రాజీనామా చేశారు. తిరిగి టిడిపిలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు గుంటూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేసిన కిలారి రోశయ్య తాజాగా వైసీపీకి రాజీనామా ప్రకటించారు. పొన్నూరు ఎమ్మెల్యే గా ఉన్న ఆయనను.. అయిష్టంగానే గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించారు. ఓటమి చెందడంతో అసంతృప్తితో ఉన్న రోశయ్యపార్టీకి గుడ్ బై చెప్పారు. ఈయన వైసీపీ సీనియర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లకు స్వయానా అల్లుడు. శాసనమండలి వైసిపి పక్ష నేతగా లేళ్ళ అప్పిరెడ్డి నియామకం తర్వాతనే కిలారి రోశయ్య పార్టీకి గుడ్ బై చెప్పడం విశేషం.ఒక వ్యూహం ప్రకారం వైసీపీ నేతలు పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగే ధర్నాకు అంతా హాజరు కావాలని స్వయంగా జగన్ పిలుపునిచ్చారు.

Read More ఏపీలో స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ఒక రోజు ముందుగానే...

కానీ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు ఆదేశాలను బేఖాతరు చేశారు. శాసనమండలి సమావేశాల్లో కనిపించారు. దీంతో వారు వేరే ఆలోచనతో ఉన్నారన్న ప్రచారం సాగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే గుంటూరు పార్లమెంట్ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య వైసీపీకి రాజీనామా చేయడం విశేషం. కేవలం ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గౌరవించలేదని ఆయన ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కనీసం ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేరును వైసీపీ శాసనమండలి పక్ష నేతగా కూడా పరిగణలోకి తీసుకోకపోవడాన్ని రోశయ్య తప్పుపట్టారు. శాసనమండలి చైర్మన్ పదవిని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆశించారు. అప్పట్లో సమీకరణల పేరుతో మోసేన్ రాజుకు పదవి ఇచ్చారు జగన్. ఇప్పుడు శాసనమండలిలో సీనియర్ సభ్యుడుగా ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లను పక్కనపెట్టి.. అదే జిల్లాకు చెందిన లేళ్ల అప్పిరెడ్డిని శాసనమండలి వైసిపి పక్ష నేతగా ఎంపిక చేయడంతో రోశయ్య పార్టీకి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది.

Read More ఘనంగా మదర్ తెరిసా 114 జయంతి వేడుకలు

వాస్తవానికి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు టిడిపిలో సీనియర్. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా కొనసాగారు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన చాలా పదవులు అనుభవించారు. కానీ వైసీపీ ఆవిర్భావంతో జగన్ వెంట అడుగులు వేశారు. వైసీపీ ఏర్పాటు సమయంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు యాక్టివ్ గా పని చేశారు. 2014 ఎన్నికల్లో విశేష సేవలు అందించారు. 2019 ఎన్నికలకు ముందు నవరత్నాలు, ఎన్నికల హామీల రూపకల్పనలోఉమ్మారెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారు. కానీ ఆయన సేవలను కేవలం ఎమ్మెల్సీ గానే వాడుకున్నారు జగన్. పెద్దగా గుర్తింపు లభించలేదు. మంత్రి పదవి ఆశించినా దక్కలేదు. కనీసం రాజ్యసభకు కూడా నామినేట్ చేయలేదు.2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. మంత్రి పదవి పై ఉమ్మారెడ్డి ఆశలు పెట్టుకున్నారు.

Read More చంద్రబాబుకు "సొంత" కుంపటి

కానీ ఆయనను కాదని అంబటి రాంబాబు, విడదల రజిని, పేర్ని నాని వంటి వారికే అవకాశం ఇచ్చారు. కనీసం ఉమ్మారెడ్డి పేరును కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఈ ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ స్థానం అభ్యర్థిగా తొలుత ఉమ్మారెడ్డి కుమారుడు వెంకటరమణ పేరు ప్రకటించారు. అయితే ఉమ్మారెడ్డి మాత్రం గుంటూరు పశ్చిమ సీటును ఆశించారు. ఆ సీటును టిడిపి నుంచి వచ్చిన మద్దాలి గిరిని కాదని విడదల రజినీకి అప్పగించారు జగన్. ఉమ్మారెడ్డి అల్లుడు కిలారి రోశయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న పొన్నూరు నియోజకవర్గ టికెట్ ను అంబటి రాంబాబు సోదరుడు మురళీకృష్ణ కేటాయించారు. అయిష్టంగానే రోశయ్య కు గుంటూరు పార్లమెంట్ టిక్కెట్ను కట్టబెట్టారు. తనకు పొన్నూరు అసెంబ్లీ స్థానం కేటాయించాలని రోశయ్య ఎన్నికలకు ముందు ఒకసారి కోరారు. అయినా సరే జగన్ ఒప్పుకోలేదు.

Read More ఆసుపత్రిలలో సేవాభావంతో  వైద్య సిబ్బంది పనిచేయలి

గత ఐదేళ్లుగా ఎటువంటి గుర్తింపు ఇవ్వకపోగా.. ఉమ్మారెడ్డి సీనియారిటీని సైతం తాజాగా శాసనమండలి వైసిపి పక్ష నేతగా పరిగణలోకి తీసుకుపోవడాన్ని ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. అందుకే ముందుగా రోశయ్య పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో ఉమ్మారెడ్డి కుటుంబం సైతం వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే వైసిపికి కోలుకోలేని దెబ్బ. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉమ్మారెడ్డి కుటుంబం జనసేనలో చేరుతుందని ప్రచారం జరుగుతోంది. అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

Read More సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమావేశం